Site icon NTV Telugu

Pak-India: బోర్డర్‌లో ఉద్వేగ పరిస్థితి.. తల్లికి దూరమైన పసిబిడ్డలు.. కారణమిదే!

Pakindia

Pakindia

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు అటారీ  సరిహద్దు దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం భారత సైన్యం పత్రాలను పరిశీలించి సరిహద్దు దాటించారు. అలా ఒక మహిళ.. సరిహద్దు దాటుతుండగా సైన్యం అడ్డుకుంది. ఆమె ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళగా గుర్తించారు. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నందున పాక్‌ వెళ్లకుండా ఆపేశారు. ఇద్దరు పసిబిడ్డలను తండ్రికి అప్పగించి.. కన్నీటితో వెనుదిరిగింది.

అసలేం జరిగిందంటే..!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివాసం ఉండే సనా అనే మహిళ పాకిస్థాన్ పౌరుడిని వివాహం చేసుకుంది. 2020లో కరాచీలో డాక్టర్ అయిన బిలాల్‌ను సనా వివాహం చేసుకుంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసు ఉన్న కుమార్తె ఉంది. అయితే ఇటీవల తన తల్లిదండ్రులను చూసేందుకు సనా తన పిల్లలతో కలిసి యూపీకి వచ్చింది. వివాహం అయిన తర్వాత సనా భారత్‌కు రావడం ఇది రెండోసారి.

ఇంతలో పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. ఆదివారంలోపు వెళ్లిపోవాలని ఆదేశాలు రావడంతో అటారీ సరిహద్దుకు పిల్లలతో సనా వచ్చింది. పిల్లలకు పాకిస్థాన్ పాస్‌పోర్టులు ఉన్నాయి. సనాకు మాత్రం భారతీయ పాస్‌పోర్ట్ ఉంది. పిల్లల్ని తీసుకుని బోర్డర్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా భారత సైన్యం సనాను అడ్డుకుంది. భారతీయ పాస్‌పోర్టు ఉన్నందున పాకిస్థాన్ వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో ఆమె కన్నటిపర్యంతం అయింది. తనను పాకిస్థాన్ పంపాలంటూ బతిమాలింది. అందుకు సైన్యం అంగీకరించలేదు. దీంతో చేసేదేమీలేక సరిహద్దులో పిల్లల్ని.. భర్తకు అప్పగించి వెనుదిరిగింది. ఈ సందర్భంగా సనా ఎక్కి ఎక్కి ఏడ్చింది. తన పిల్లలు చిన్నవాళ్లని.. దయచేసి తనను వెళ్లనివ్వాలని బతిమాలింది. అందుకు సైన్యం అంగీకరించలేదు. పిల్లల్ని తండ్రికి అప్పగించేసి.. మీరట్‌కు వెనుదిరిగింది. ప్రభుత్వ ఆదేశాల కొరకు వేచి ఉండాలని సనాకు సూచించారు.

పిల్లలకు పాకిస్థాన్ పాస్‌పోర్టులు ఉన్నందున దేశం విడిచి వెళ్లాలని అధికారులు చెప్పారని సనా తెలిపింది. అయితే తనకు భారతీయ పాస్‌ పోర్టు ఉన్నందున తిరిగి మీరట్ వెళ్లిపోవాలని చెప్పారన్నారు. పహల్గామ్ దాడి వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని.. తనను మాత్రం పాకిస్థాన్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని సనా కోరింది.

Exit mobile version