High Voltage Drama: ప్రేమ పిచ్చో.. లేక పంతమో తెలియదు కానీ, తన ప్రేమను గెలిపించుకోవడానికి ఓ బాలిక చేసిన పని ఇప్పుడు ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా, ఘోసి కోత్వాలి పరిధిలో ఉన్న లఖానీ ముబారక్‌పూర్ గ్రామంలో సినిమా ఫక్కీలో జరిగిన ఒక హై-వోల్టేజ్ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలంటూ ఓ మైనర్ బాలిక మొబైల్ టవర్ ఎక్కి గ్రామస్థులను, పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అసలు ఏం జరిగిందంటే..
మాణిక్‌పూర్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక, పొరుగు గ్రామమైన లఖానీ ముబారక్‌పూర్‌కు చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ, పెద్దలు వారి ప్రేమకు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక, శనివారం గ్రామంలోని ఒక ఎత్తైన మొబైల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. గ్రామస్థులు టవర్ పై ఉన్న బాలికను చూసి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని మైకుల ద్వారా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తన ప్రియుడిని అక్కడికి పిలిపించి పెళ్లి చేయాలని, లేదంటే కిందకు దిగేది లేదని ఆమె మొండికేసింది. ప్రియుడు గానీ, అతని కుటుంబం గానీ అక్కడికి రాకపోవడంతో దాదాపు రెండు గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. చివరికి పోలీసులు “మీ పెళ్లి చేస్తాం” అని హామీ ఇవ్వడంతో ఆమె శాంతించి సురక్షితంగా కిందకు దిగింది.
బాలికను సురక్షితంగా దించిన పోలీసులు, అనంతరం ఆమెను, యువకుడి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఈ విషయంపై అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనూప్ కుమార్ స్పందిస్తూ.. “బాలిక మైనర్ కావడంతో ప్రస్తుతం ‘మిషన్ శక్తి’ బృందంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. యువత భావోద్వేగాలకు లోనై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. వివాహం కంటే విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వారికి అవగాహన కల్పిస్తున్నాం” అని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఇరు పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
