UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!

  • ఉత్తరప్రదేశ్‌లో అరుదైన ఘటన
  • ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త
  • స్థానికంగా చర్చనీయాంశం
Up

Up

ఉత్తరప్రదేశ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు పిల్లల తల్లైన భార్యకు ఆమె ప్రియుడితో భర్తే స్వయంగా పెళ్లి జరిపించాడు. కుటుంబంలో రోజూ జరుగుతున్న గొడవలకు ముగింపు పలకాలని భావించిన భర్త.. భార్య కోరుకున్న వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో జరిగింది.

దేబ్రీ గ్రామానికి చెందిన బుద్ధిరామ్ నిషాద్ (45), ఫూల్‌మతి (37) భార్యాభర్తలు. దాదాపు 21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒక కుమారుడికి ప్రస్తుతం 18 ఏళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు.

అయితే కొన్ని నెలల క్రితం ఫూల్‌మతికి 26 ఏళ్ల అవధేశ్‌తో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారినట్లు సమాచారం. ఈ విషయం దంపతుల మధ్య విభేదాలకు దారితీసింది. దాదాపు రెండు నెలల క్రితం ఫూల్‌మతి అవధేశ్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. అయినప్పటికీ కుటుంబంలో విభేదాలు, గొడవలు సద్దుమణగలేదు. ఇంట్లో ప్రతిరోజూ వివాదాలు కొనసాగడం ఇష్టం లేకపోవడంతో బుద్ధిరామ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనతో కలిసి జీవించేందుకు భార్య ఆసక్తి చూపడం లేదని భావించిన ఆయన.. ఆమె కోరుకున్న అవధేశ్‌తో వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో మంగళవారం అస్రఫ్‌పూర్ గ్రామంలోని శివాలయంలో గ్రామస్తుల సమక్షంలో ఫూల్‌మతి, అవధేశ్‌ల వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి బుద్ధిరామ్ కూడా హాజరయ్యాడు. సంప్రదాయం ప్రకారం వివాహం అనంతరం జరిగే వీడ్కోలు కార్యక్రమంలోనూ పాల్గొన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై బుద్ధిరామ్ మాట్లాడుతూ.. ‘‘ఫూల్‌మతిని 21 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆమె నాతో కలిసి జీవించాలనుకోవడం లేదు. ఇంట్లో ప్రతిరోజూ గొడవలు కొనసాగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆమె ఎవరితో కలిసి జీవించాలనుకుంటుందో.. ఆ వ్యక్తితోనే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. గ్రామస్తుల సమక్షంలో జరిగిన ఈ వివాహం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.