UP Farmers Relief: రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట

Up Farmers Relief

Up Farmers Relief

UP Farmers Relief: ప్రకృతి విపత్తులతో నష్టపోయే రైతులు, బాధిత కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం విపత్తు సహాయ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ పరిహారాన్ని భారీగా పెంచింది. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు అందిస్తున్న రూ.4 లక్షల పరిహారాన్ని రూ.8 లక్షలకు పెంచింది. అదేవిధంగా పంట నష్టపరిహారాన్ని 25 నుంచి 30 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశువులు, కోళ్లు, వ్యవసాయ భూములు, ఇళ్లు, విద్యాసంస్థలు, ఇతర ఆస్తులకు కలిగే నష్టాలకు కూడా అదనపు ఆర్థిక సాయం అందించనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరణించిన వారి కుటుంబాలకు రూ.8 లక్షల పరిహారం
కొత్త నిబంధనల్లో అత్యంత కీలకమైన మార్పు ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు అందించే పరిహారం పెంపు. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం రూ.8 లక్షలకు పెంచింది. అలాగే పశువులు, ఇతర జీవనాధార జంతువులను కోల్పోయిన రైతులకు కూడా పరిహారం పెంచింది. పెద్ద పశువులు మరణిస్తే గతంలో రూ.40 వేలు ఇవ్వగా, ఇప్పుడు రూ.50 వేలు అందించనున్నారు. మేకలు, గొర్రెలు, పందులు వంటి చిన్న జంతువులకు గతంలో రూ.4 వేలుగా ఉన్న పరిహారాన్ని రూ.5,500కు పెంచారు. గుర్రాలు, కంచర గాడిదలు వంటి బరువు మోసే జంతువులు మరణిస్తే రూ.20 వేల నుంచి రూ.25,400కు పరిహారం పెంచారు. కోళ్ల పెంపకందారులకు ఒక్కో కోడికి గతంలో రూ.100 ఇవ్వగా, ఇప్పుడు రూ.130 అందించనున్నారు.

పంట నష్టపరిహారం 30 శాతం వరకు పెంపు
వరదలు, భారీ వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు మరింత ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం పరిహారాన్ని పెంచింది. సాగు భూముల రకాన్ని బట్టి కొత్త పరిహార రేట్లను నిర్ణయించింది. నీటిపారుదల సౌకర్యం ఉన్న భూముల్లో పంట నష్టానికి హెక్టారుకు గతంలో రూ.17 వేలు ఇవ్వగా, ఇప్పుడు రూ.22 వేలు అందించనున్నారు. వర్షాధార భూములకు గతంలో రూ.8,500 ఇవ్వగా, దానిని రూ.11 వేలకు పెంచారు. శాశ్వత పంటలు, వ్యవసాయ అడవుల పెంపకం (Agroforestry) కింద కలిగే నష్టాలకు హెక్టారుకు రూ.22,500 నుంచి రూ.30 వేలకు పరిహారం పెంచారు.

పట్టు రైతులకూ అదనపు ఆర్థిక సాయం
పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతులకు కూడా యోగి ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రకృతి విపత్తుల వల్ల పట్టు సాగులో నష్టాలు ఎదురైతే అందించే పరిహారాన్ని పెంచింది. ఎరి, మల్బరీ, తసర్ పట్టు ఉత్పత్తికి గతంలో హెక్టారుకు రూ.6 వేలు అందించగా, ఇప్పుడు రూ.7,800 ఇవ్వనున్నారు. ముగా పట్టు ఉత్పత్తికి గతంలో రూ.7,500గా ఉన్న పరిహారాన్ని రూ.9,800కు పెంచారు. దీంతో పట్టు సాగు చేసే రైతులకు కూడా అదనపు ప్రయోజనం కలగనుంది.

వ్యవసాయ భూములు దెబ్బతింటే పరిహారం పెంపు
వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తుల వల్ల వ్యవసాయ భూములు దెబ్బతిన్నా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. పొలాల్లో వరదల కారణంగా పేరుకుపోయిన ఒండ్రుమట్టిని తొలగించేందుకు గతంలో హెక్టారుకు రూ.18 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు దానిని రూ.23 వేలకు పెంచారు. కొండచరియలు, మంచు చరియలు విరిగిపడటం వల్ల దెబ్బతిన్న భూములకు గతంలో రూ.47 వేలు ఇవ్వగా, ప్రస్తుతం రూ.60 వేలు అందించనున్నారు.

బాధిత కుటుంబాలకు 30 రోజుల వరకు సహాయం
ప్రకృతి విపత్తుల కారణంగా ఇళ్లను విడిచి సహాయ శిబిరాల్లో తలదాచుకునే కుటుంబాలకు కూడా కొత్త నిబంధనల్లో ఊరట కల్పించారు. బాధిత కుటుంబాలకు గరిష్ఠంగా 30 రోజుల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. కరువు పరిస్థితులు ఏర్పడితే తాగునీటి సరఫరా కోసం 90 రోజుల వరకు సహాయం అందించే వెసులుబాటు కల్పించారు. వ్యవసాయంతో పాటు ఇళ్లు, పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాల మరమ్మతులకు కూడా ఆర్థిక సాయం అందించనున్నారు.

ఇళ్లు పూర్తిగా దెబ్బతింటే రూ.2.06 లక్షల వరకు పరిహారం
ప్రకృతి విపత్తుల్లో ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు అందించే పరిహారాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మైదాన ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసమైతే రూ.1.85 లక్షలు అందించనున్నారు. కొండ ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా దెబ్బతింటే రూ.2.06 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. మైదాన ప్రాంతాల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.93 వేలు అందించనున్నారు.

పాఠశాలల మరమ్మతులకు రూ.26 లక్షల వరకు సాయం
ప్రకృతి విపత్తుల వల్ల దెబ్బతిన్న విద్యాసంస్థల పునరుద్ధరణకు కూడా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ప్రాథమిక పాఠశాలల మరమ్మతులకు గరిష్ఠంగా రూ.15.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. సెకండరీ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, పాలిటెక్నిక్ విద్యాసంస్థలకు రూ.26 లక్షల వరకు పరిహారం కల్పించేలా నిబంధనలు సవరించారు. ఇలా విద్యా మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.

ఏ తేదీ నుంచి వర్తిస్తాయంటే?
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సవరించిన ఈ విపత్తు పరిహార నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 4 వరకు జరిగిన నష్టాలకు వర్తించనున్నాయి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) మార్గదర్శకాల ప్రకారం ఈ ఆర్థిక సహాయం అందించనున్నారు. మొత్తంగా చూస్తే.. ప్రకృతి విపత్తుల కారణంగా ప్రాణాలు, పంటలు, పశువులు, ఆస్తులు కోల్పోయిన బాధితులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. ముఖ్యంగా రైతులకు పంట నష్టపరిహారం పెంచడం, ఇతర జీవనాధారాలకు అదనపు సాయం అందించడం ద్వారా విపత్తుల సమయంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది.