UP Elections: ఉత్తర్ ప్రదేశ్ 2027 అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ(ఎస్పీ)లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్నికల సంగ్రామంలోకి బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి యూపీలోని పలు ప్రాంతాల్లో సమన్వయం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య సంస్థాగత సమన్వయంపై దృష్టి పెరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, యూపీ ఇన్‌చార్జ్ వినోద్ తావ్డే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత పరిస్థితి, క్షేత్రస్థాయి సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ-ఆర్ఎస్ఎస్ సమన్వయం..
ఆర్ఎస్ఎస్ తరుఫున జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, బీజేపీ నేతల మధ్య సమావేశం జరిగింది. పార్టీ, ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ మద్య సమన్వయం, స్థానిక స్థాయిలో ఉన్న అసంతృప్తి, సంస్థాగత సమస్యలనున గుర్తించడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వినోద్ తావ్డే యూపీ ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పర్యటిస్తు్న్నారు. గోరఖ్‌పూర్, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి ప్రాంతాల్లో సమావేశాలు నిర్వమించి, స్థానిక పరిస్థితులపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు.
బలహీన స్థానాలపై దృష్టి..
2022 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరును సమీక్షించడంతో పాటు, ఆయా ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లపై ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, స్థానిక సమస్యల్ని అర్థం చేసుకోవడంపై దృష్టి సారించారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో సామాజిక సమీకరణాలు అర్థం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటారని భావిస్తున్న అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన తప్పుల్ని పునరావృతం చేయకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు కలిసి కసరత్తు మొదలుపెట్టాయి.

