వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో పట్టు సాధించడానికి అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఓవైపు, మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పావులు కదుపుతుంటూ.. ఇంకా వైపు.. ప్రతీ అంశాన్ని క్యాచ్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.. ఎస్పీ, బీఎస్పీలు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఇక, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఇతర రాష్ట్రాలకు విస్తరించడంపై ఫోకస్ పెట్టింది.. ఈ తరుణంలో.. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన రాజేష్ పతి త్రిపాఠి, లలితేష్ పతి త్రిపాఠి.. ఇవాళ సిలిగురిలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమతాబెనర్జి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జి సమక్షంలో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also: రాష్ట్రపతి దృష్టికి బాబు తీసుకెళ్లిన అంశాలు ఇవే.. ఆయన రియాక్షన్ ఏంటంటే..?
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పనితీరు నచ్చే తాము ఆ పార్టీలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు ఇద్దరు నేతలు.. కాగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఈ తరుణంలో రాజకీయ వలసలకు తెరలేపాయి అన్ని పార్టీలు.. అవకాశాల కోసం కొందరు.. అలిగి మరికొందరు.. ఇలా వివిధ కారణాలతో పార్టీలు మారుతున్నారు. అయితే, ఈసారి యూపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. ప్రియాంకాగాంధీ వాద్రాను రంగంలోకి దింపింది.. ప్రతీ అంశంలో బీజేపీని ఇరకాటం పెడుతున్నారామె.. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, స్కూటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రియాంక.. కానీ, మరోవైపు కీలక నేతలు పార్టీని వీడడం ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ జంపింగ్‌లపై కూడా దృష్టిపెట్టాలని నేతలు చెబుతున్నారు.
