India At UN: సమావేశ అజెండాతో సంబంధం లేకుండా దాయాది దేశం పాకిస్తాన్ ప్రవర్తించడం సాధారణంగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలపై ఏ అంశంపై సమావేశం జరిగినా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఇప్పటికీ చాలా సార్లు పాక్ వైఖరిని భారత్ తూర్పారపట్టింది. అయినా కూడా తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఇప్పటికే చాలా సార్లు ఇది తమ అంతర్గత వ్యవహారమని, భారత్ లో జమ్మూ కాశ్మీర్ భాగంగా ఉంది, ఉంటుంది అని భారత్ ఘాటుగానే స్పందిస్తోంది.
తాజాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మరోసారి కాశ్మీర్ రాగాన్ని ఎత్తుకుంది పాకిస్తాన్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ‘అంతర్జాతీయ శాంతి మరియు భద్రతా నిర్వహణ’ పై జరుగుతున్న బహిరంగ చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు. చైనా అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు.
Read Also: Apple iPhone 16 : సూపర్ ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. ఆన్లైన్లో లీకైన డేటా ఇదే..
దీనిపై భారత్ గట్టిగానే బదులిచ్చింది. ‘‘ అనవసరమైన, అలవాటైన’’ పద్దతి అని పాకిస్తాన్ వైఖరిని తప్పుపట్టింది. ‘‘ నాదేశంపై వేరే దేశపు ప్రతినిధి చేసిన అనవసరమైన, అలవాటైన వ్యాఖ్యల్ని తోసిపుచ్చడానికి నేను కొన్ని సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోను, నా ప్రతిస్పందనతో వాటిని గౌరవించను’’ అని యూఏన్‌లో భారతదేశ శాశ్వత మిషన్ కౌన్సెలర్ ఆర్ మధు సూదన్ సోమవారం అన్నారు.
ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం ఎత్తేసింది. అప్పటి నుంచి భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ తో వ్యాపారాన్ని పాక్ బంద్ చేసింది. భారత రాయబారిని బహిష్కరించింది. ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత విషయమని భారత్ అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. ఉగ్రవాదం, హింస లేని పాకిస్తాన్ తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ స్పష్టం చేసింది.
