జోధ్‌పూర్ ఘర్షణల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే… పెద్దఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్. కావాలనే కొంతమంది అల్లర్లు సృష్టించారని ఆయన ఆరోపించారు. కార్లను ధ్వంసం చేయడం, ఇళ్లపై రాళ్లతో దాడి చేయడం, మహిళలను అవమానించడం వంటివి జరిగాయన్నారు. అల్లర్లకు అరికట్టడంలో… రాజస్థాన్ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యాయన్నారు. రాత్రి అల్లర్లు జరిగినా… ఉదయానికి కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు. కాగా, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇరువర్గాల మధ్య సోమవారం రాత్రి నుంచి మొదలైన ఘర్షణలు.. మంగళవారం ఈదుల్ ఫితర్, అక్షయ తృతీయ పండగులు జరుపుకుంటున్న వేళ కూడా కొనసాగాయి. దీంతో పోలీసులు, అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. అల్లర్లను అణచివేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వారిపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. జోధ్‌పూర్‌లోని జలోరి గేట్ ఇంటరాక్షన్ సర్కిల్ బల్ముకోండ బిస్సా వద్ద ఓ ప్రార్థనా స్థలంపై మరో వర్గానికి చెందిన జెండా ఎగురవేయడమే ఈ ఘర్షణలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. లౌడ్ స్పీకర్లను తొలగించారు. రాళ్ల దాడుల్లో పలువురు గాయాలపాలయ్యారు.
ఘర్షణలు హింసాత్మకంగా మారే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, అవాస్తవ ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బల్క్ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా సేవలను కూడా నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. జోధ్‌పూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండటంతో.. పోలీసులు కర్ఫ్యూ విధించారు. పండుగ వేళ ఈ ఘర్షణలు విచారకరమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. శాంతిభద్రతలు పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.