NTV Telugu Site icon

Bangladesh: హిందూనేత అరెస్ట్..భారత్ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మతనాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. భారత్ ఆయన అరెస్ట్‌పై, బెయిల్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీలపై పోలీసుల దాడిని ఖండించింది. మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ రోజు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.

Read Also: Bangladesh: హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ తరుపున వాదిస్తున్న ముస్లిం లాయర్ హత్య..

ఇదిలా ఉంటే, భారత్ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ స్పందించింది. చిన్మోయ్ అరెస్ట్‌‌ని కొన్ని వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని చెప్పింది. భారత ప్రకటన ‘‘నిరాధారమైనంది’’; ’’ స్నేహ స్పూర్తి విరుద్ధం’’ అని పేర్కొంది. రెండు పొరుగు దేశాల మధ్య స్నేహం, స్పూర్తికి విరుద్ధమైనవిగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. భారత ప్రకటన బంగ్లాదేశ్‌లోని సామరస్యాన్ని ప్రతిబింబించలేదని బంగ్లాదేశ్ చెప్పింది. ప్రతీ బంగ్లాదేశ్ పౌరుడికి మతపరమైన గుర్తింపుతో సంబంధం లేకుండా మతపరమైన ఆచారాలు నిర్వహించడంలో, అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని చెప్పింది. గత నెలలో దేశవ్యాప్తంగా శాంతియుతంగా దుర్గాపూజ నిర్వహించడం రుజువు చేసినట్లు ఆ దేశం చెప్పింది. బంగ్లాదేశ్ న్యాయవ్యవస్థ “పూర్తి స్వతంత్రం” అని, న్యాయవ్యవస్థ పనిలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని పేర్కొంది.

బంగ్లాదేశ్ పోలీసులు చిన్మోయ్ కృష్ణదాస్‌ని దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసింది. ఆయన రాజధాని ఢాకా నుంచి చిట్టోగ్రామ్ వెళ్లే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై అక్కడి పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.