ఓవైపు పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రాష్ట్ర అధ్యక్షుడు అశ్వినీ శర్మ సమక్షంలో… కాషాయ కండువా కప్పుకున్నారు. తమ పార్టీలోకి వచ్చిన జేజే సింగ్‌ను బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు. 2017లో శిరోమణి అకాలీదళ్‌లో చేరిన జేజే సింగ్.. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పటియాలా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2018లో అకాలీదళ్ నుంచి బయటకు వచ్చేశారు. 2005 నుంచి 2007 వరకు ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన జేజే సింగ్.. 2008 జనవరి నుంచి 2013 మే వరకు అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గానూ సేవలందించారు.
Read Also: ఐఎన్‌ఎస్ ‘రణ్‌వీర్’లో పేలుడు..
మరోవైపు ఎంపీ భగవంత్ సింగ్ మాన్‌ను… ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత తమ పార్టీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ప్రకటించారు కేజ్రీవాల్. ఆన్‌లైన్ సర్వేలో దాదాపు 93 శాతం మంది ప్రజలు భగవంత్ మాన్‌కే జై కొట్టినట్లు ఆయన తెలిపారు. 48 ఏళ్ల భగవంత్ సింగ్ మాన్.. ఆప్ తరపున సంగ్రూర్ పార్లమెంట్‌స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కొన్ని పంజాబ్ చిత్రాల్లోనూ నటించారు. 2017లో జరిగిన ఎన్నికల్లో 20 సీట్లు సాధించిన ఆప్…ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని ఆప్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.