NTV Telugu Site icon

Samajwadi Party: కాంగ్రెస్‌‌కి అఖిలేష్ యాదవ్ షాక్‌.. ఉప ఎన్నికల్లో సీట్ల షేరింగ్‌కి ‘నో’..

Samajwadi Party

Samajwadi Party

Samajwadi Party: హర్యానా ఎన్నికల ఓటమి కాంగ్రెస్‌ పార్టీపై బాగానే కనిపిస్తోంది. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై సమీక్ష చేసుకోవాలని ఒమర్ అబ్దుల్లా సూచించారు. ఖచ్చితంగా గెలుస్తుందని భావించిన కాంగ్రెస్ బొక్కబోర్లా పడటంతో పలు పార్టీలు ఆ పార్టీతో పొత్తుపై పునరాలోచిస్తున్నాయి. ఈ ప్రభావం వచ్చే మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో పడబోతోంది.

ఇదిలా ఉంటే, ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న అఖిలేష్ యాదవ్‌కి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కాంగ్రెస్‌కి భారీ షాక్ ఇచ్చింది. త్వరలో ఉత్తర్ ప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీట్ల షేరింగ్ అభ్యర్థనను ఎస్పీ తిరస్కరించింది. ఈ ఏడాది చివర్లలో 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాబోయే ఎన్నికల్లో 10లో 5 ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది. అయితే, ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రదర్శనను చూపెడుతూ.. ఆ పార్టీ ప్రపోజల్‌‌ని ఎస్పీ తిరస్కరించింది.

Read Also: Honor Tablet GT Pro: హానర్ నుంచి కొత్త ట్యాబ్.. డిజైన్, ఫీచర్లు ఇవే

త్వరలో జరగబోతున్న ఉప ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గానూ 06 స్థానాలకు ఎస్పీ తన అభ్యర్థుల్ని బుధవారం ప్రకటించింది. కర్హల్ నుండి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను, సిసాము స్థానం నుండి నసీమ్ సోలంకి, ఫుల్‌పూర్ (ప్రయాగ్‌రాజ్) నుండి ముస్తఫా సిద్దిఖీ , మిల్కిపూర్ (అయోధ్య) నుండి అజిత్ ప్రసాద్‌లకు టికెట్ ఇచ్చింది. కతేహరి, మజ్వాన్ స్థానాల నుంచి శోభావాయ్ వర్మ, జ్యోతి బింద్‌లకు పార్టీ బరిలోకి దింపింది. ఎస్పీ నేత రవిదాస్ మెహ్రోత్రా.. హర్యానాలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడానికి ప్రస్తావించారు. వారు సమాజ్‌వాదీ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, మొత్తం రాష్ట్రాన్ని బీజేపీ ఇచ్చారని అన్నారు.

సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఈ రోజు హర్యానాలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేదని ఆయన అన్నారు. యూపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని భావిస్తున్నామని, అందుకే ఆరుగురు అభ్యర్థుల్ని ప్రకటించినట్లు రవిదాస్ చెప్పారు. మిగిలిన 4 స్థానాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. తమను సంప్రదించకుండా ఎస్పీ అభ్యర్థుల్ని ప్రకటించడంపై యూపీ కాంగ్రెస్ ఇంచార్జ్ అవినాష్ పాండే అసంతృప్తి వ్యక్తం చేశారు.

Show comments