సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రకటనను ప్రశ్నిస్తూ పటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మంత్రి ఉపయోగించిన భాష జాతి విధ్వంసాన్ని సూచిస్తుందని అభిప్రాయపడింది. ద్వేషపూరిత ప్రసంగానికి సమానమని ధర్మాసనం పేర్కొంది.

సనాతన ధర్మ అనుచరులపై జాతి హత్యగా పిలుపునిచ్చినట్లుగా ఉందని కోర్టు తెలిపింది. సనాతన ధర్మాన్ని ఒక మతంగా భావిస్తే.. సనాతన ధర్మం అనుసరించే వ్యక్తులు ఉండకూడదని చెబితే.. అది మతహత్య అవుతుందని.. అంటే మతాన్ని నాశనం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో ఉపయోగించిన పదాలు కచ్చితంగా.. జాతి నిర్మూలన, సాంస్కృతిక విధ్వంసాన్ని సూచిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Trump-Iran: నన్ను చంపితే.. భూమిపై ఇరానే ఉండదు.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
ఉదయనిధి స్టాలిన్ పోస్ట్‌ను విమర్శించినందుకు బీజేపీ నేత అమిత్ మాలవీయపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టేసింది. మంత్రి చేసిన వ్యాఖ్యలకు అమిత్ స్పందించడంలో తప్పు లేదని.. ప్రతి చర్యగా ఆయనపై చర్యలు తీసుకోవడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని పేర్కొంది. ఆయనకు కోలుకోలేని హాని, గాయం కలిగిస్తుందని జస్టిస్ అభిప్రాయపడ్డారు. ఇక ద్వేషపూర్తిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ బుక్ కాకపోవడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
అసలేం జరిగింది..
2023లో తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘సనాతన నిర్మూలన సమావేశం’ అనే సదస్సుకు మంత్రి ఉదయనిధి హాజరై చేసిన ప్రసంగమే సమస్యకు కారణమైంది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి దానిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాత మంత్రిపై మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అనంతరం ప్రసంగం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తన ప్రసంగాన్ని వక్రీకరించారని మంత్రి అన్నారు. భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న 80 శాతం మంది ప్రజలను మంత్రి మారణహోమానికి పిలుపునిచ్చినట్లుగా వక్రీకరించారని అమిత్ మాలవీయపై కేసు నమోదైంది. తాజాగా ఆయనపై ఎఫ్ఐఆర్‌ను కొట్టేయమని ఆదేశించింది.
త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో న్యాయస్థానం తీర్పు డీఎంకే పార్టీకి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.