Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..

  • వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.
  • విచారణ అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం.
  • రిమాండ్ కోరబోమని కోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం.
  • అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆందోళనలు.
Udhayanidhi Stalin

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin: సినీ నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టైన తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌‌కు మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. విచారణ పూర్తయ్యాక వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని తమిళనాడు పోలీసుల్ని ఆదేశించింది. కావేరీ జల వివాదం నేపథ్యంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు భావించి ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. హైడ్రామా నడుమ ఆయనను అరెస్ట్ చేశారు.

ఉదయనిధి అరెస్ట్ తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఉదయనిధిని తంజావూర్ తరలించినప్పటికీ, ఆయనను న్యాయస్థాన రిమాండ్‌కు పంపే ఉద్దేశం లేదని కేవలం విచారణ నిర్వహించి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేస్తామని తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కోర్టు తెలిపారు. విచారణ అనంతరం అదే రోజు ఉదయనిధిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇదిలా ఉంటే, ఉదయనిధి అరెస్ట్‌పై తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే శ్రేణులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్ అత్యవసర భేటీ నిర్వహించి, తదుపరి కార్యచరణపై చర్చించారు. ఈ కేసులో అసభ్య పదజాలం వినియోగం, మహిళ గౌరవాన్ని అవమానించడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అల్లర్లకు ప్రేరేపించడం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన పలు సెక్షన్ల కింద ఉదయనిధిపై కేసులు నమోదు చేశారు. తాను సీఎం విజయ్ పేరు తప్పా, మరెవరి పేరు ప్రస్తావించలేదని ఉదయనిధి మీడియాతో అన్నారు. మరోవైపు, టీవీకే ఉదయనిధి వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించింది.