NTV Telugu Site icon

Maharashtra Politics: ఉద్ధవ్‌కు మరో దెబ్బ.. ఏక్‌నాథ్ షిండేను కలిసిన థాక్రే సోదరుడి కుమారుడు

Nihar Thackeray

Nihar Thackeray

Maharashtra Politics: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ఎన్నికైన తర్వాత శివసేనపై పట్టు కోసం పోరాడుతున్న ఉద్ధవ్ ఠాక్రేకు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసిన తర్వాత ఉద్ధవ్ థాక్రేకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఈ క్రమంలోనే షిండే ఉద్ధవ్ వర్గానికి మరో షాకిచ్చాడు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే అన్న కుమారుడైన నిహార్ థాక్రే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు.  ఉద్ధవ్ థాక్రే సోదరుడైన దివంగత బిందుమాధవ్ థాక్రే కుమారుడైన నిహార్ థాక్రే ఇప్పటివరకు రాజకీయాల్లో పెద్దగా రాణించలేదు. కానీ ఇవాళ తిరుగుబాటు సేన నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలుసుకుని మద్దతు ప్రకటించారు.

1996లో రోడ్డు ప్రమాదంలో మరణించిన నిహార్ థాకరే తండ్రి బిందుమాధవ్ థాక్రే, బాల్ థాక్రే ముగ్గురు కుమారులలో పెద్దవాడు. మిగిలిన ఇద్దరు జయదేవ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రే. సినీ నిర్మాత అయిన బిందుమాధవ్ థాక్రే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ బిందుమాధ‌వ్ ఠాక్రే త‌న‌యుడు నిహార్ ఇప్పుడు సీఎం ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఇంత‌కుముందు జ‌య్‌దేవ్ ఠాక్రే మాజీ భార్య స్మిత ఠాక్రే కూడా ఇటీవ‌ల సీఎం షిండేను క‌లుసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే మిన‌హా బాల్‌ఠాక్రే కుటుంబ స‌భ్యులెవ‌రూ రాజ‌కీయాల‌తో ఆస‌క్తి చూపేవారు కాదు. 2012లో బాల్‌ఠాక్రే మ‌ర‌ణం త‌ర్వాత కొన్ని వివాదాలు కొన‌సాగాయి. న్యాయవాది అయిన నిహార్ థాక్రే గత డిసెంబర్‌లో బీజేపీ నేత హర్షవర్ధన్ పాటిల్ కుమార్తె అంకితా పాటిల్‌ను వివాహం చేసుకున్నారు. హర్షవర్ధన్ పాటిల్ కాంగ్రెస్ మాజీ నాయకుడు, ఆయన చాలా సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు.

Adhir Ranjan Chowdhury: ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై రాష్ట్రపతికి అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు

ఇటీవల శివసేన మౌత్ పీస్ ‘సామ్నా’ ప‌త్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. తాను గత ఏడాది అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడే తనను అధికారం నుంచి దించేయడానికి, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏక్ నాథ్ షిండే కుట్ర చేశారని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. “మా ప్రభుత్వం పోయింది, నా ముఖ్యమంత్రి పదవి పోయింది. అయినా నాకేమీ బాధ లేదు. కానీ నా సొంత వాళ్లే ద్రోహులుగా మారిపోయారు. నేను ఆపరేషన్ అయిన తర్వాత కోలుకుంటున్నప్పుడు వారు నా ప్రభుత్వాన్ని దించడానికి ప్రయత్నించారు” అని ఉద్ధవ్ ఠాక్రే ఇంటర్వ్యూలో అన్నారు.