Shiv Sena: మహారాష్ట్రలో శివసేన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజమైన శివసేన తమదే అంటూ ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇటీవల స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. నిజమైన శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గమే అని తీర్పు చెప్పారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జనవరి 10న స్పీకర నార్వేకర్ ఏక్‌నాథ్ షిండే వర్గానికి అనుకూలంగా తీర్పు చెప్పారు. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున నిజమైన శివసేన ఏక్‌నాథ్ షిండేదని చెప్పాడు. ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని రెండు వర్గాల సభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకు కూడా స్పీకర్ నిరాకరించారు.
Read Also: Viral News: గర్ల్ ఫ్రెండ్ కోసం అలాంటి పని చేసి అడ్డంగా దొరికిన యువకుడు.. అయ్యో ఎంత పనైంది..
అయితే స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్దారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను అవమానించడమని, ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. స్పీకర్ తన బాధ్యతలను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. రాష్ట్రప్రజలు ఈ నిర్ణయాన్ని అంగీకరించరని వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్పారు.
జూన్ 2022లో శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ప్రభుత్వంపై వ్యతిరేకతతో 40 మంది ఎమ్యెల్యేలు అసమ్మతి వర్గంగా ఏర్పడటంతో అక్కడి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీతో కలిసి ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిజమైన శివసేన కోసం ఇరు వర్గాల మధ్య పోరాటం సాగుతోంది.
