Site icon NTV Telugu

UDAN Scheme 2.0: దేశంలో కొత్తగా 100 ఎయిర్‌పోర్టులు, 200 హెలిప్యాడ్స్..

Airports

Airports

UDAN Scheme 2.0: రాబోయే పదేళ్లలో విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రి వర్గం ప్రతిష్టాత్మక ప్రణాళికలకు ఓకే చెప్పింది. బుధవారం రూ. 28,840 కోట్ల మొత్తం వ్యయంతో ఉడాన్ పథకాన్ని అప్‌డేట్ చేసింది. సవరించిన ఉడాన్ 2.0 పథకాన్ని 2026-27 నుంచి 2035-36 వరకు అమలు చేయనున్నారు. రాబోయే 8 ఏళ్లలో రూ. 12,159 కోట్ల మూలధన వ్యయంతో, ప్రస్తుతం సేవలు అందని ఎయిర్‌స్ట్రిప్‌లను ఆధునీకరించడం ద్వారా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయడమే లక్ష్య్ంగా పెట్టుకున్నారు.

ఈ ప్రణాళిక ద్వారా ముఖ్యంగా కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీని పెంచనున్నారు. ఇందులో భాగంగా కొత్తగా 200 ఆధునిక హెలిప్యాడ్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీని కోసం ఒక్కోక్కటికి రూ.15 కోట్లు వ్యయం చేయనున్నారు. కఠినమైన ప్రాంతాల్లో అత్యవసర సేవలు, ఆరోగ్య సంరక్షణ అందించే లక్ష్యంతో 8 ఏళ్లలో రూ. 3661 కోట్లు కేటాయించారు.

Read Also: Telangana Assembly: ఆ సారా తాగడం వల్లనే 100 ఏళ్లు బతికారు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..

సుదూర ప్రాంతాల్లో కార్యకలాపాలకు అవసరమైన చిన్న విమానాల కొరతను తీర్చడానికి స్వదేశీ విమానాల కొనుగోలుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా పవన్ హన్స్ కోసం రెండు హెచ్‌ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్లు, అలయన్స్ ఎయిర్ కోసం రెండు హెచ్‌ఏఎల్ డోర్నియర్ విమానాలు కేటాయించారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ (VGF) కింద రూ. 10,043 కోట్లు కేటాయించారు. దీనివల్ల మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ ధరకే విమాన టికెట్లు అందుబాటులోకి వస్తాయి.

2016లో ప్రారంభించిన ఉడాన్ పథకం ద్వారా, 2026 ఫిబ్రవరి వరకు 95 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్ ఏరోడ్రోమ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 3.41 లక్షల విమాన సర్వీసులు సేవలు అందించాయి. మొత్తం 1.62 కోట్ల ప్రయాణికులు ప్రయాణించారు.

Exit mobile version