కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం నాడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కేఎస్ షాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. శనివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ ఘటన మరువకముందే ఆదివారం ఉదయం బీజేపీ నేత రెంజిత్ శ్రీనివాసన్ కూడా హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే షాన్ హత్యకు ప్రతీకారంగానే శ్రీనివాసన్‌ను మర్డర్ చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:
కేవలం 12 గంటల వ్యవధిలోనే రెండు రాజకీయ హత్యలు జరగడంతో అలప్పుజా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. అలప్పుజా జిల్లాలో 2 రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. రెండు రాజకీయ హత్యలపై తాము దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. అటు ఈ రెండు ఘటనలపై సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు.
