NTV Telugu Site icon

Mamata Banerjee: బెంగాల్‌ని బంగ్లాదేశ్‌లా చేయాలనుకుంటున్నారు.. వైద్యురాలి అత్యాచార కేసుపై మమతా..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ పీజీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా మెడికోలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీపై ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ఈ కేసులోని నిందితులతో టీఎంసీ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా నిన్న కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును అప్పగించింది.

ఈ ఘటన బీజేపీ, సీపీఎంలు ‘‘చౌకబారు రాజకీయాలకు’’ పాల్పడుతున్నాయని సీఎం మమతా బెనర్జీ బుధవారం ఫైర్ అయ్యారు. ‘‘బాధిత మహిళ కుటుంబానికి అండగా నిలవాల్సిందిపోయి రెండు పార్టీలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ పరిస్థితులు తీసుకురావాలని వారు భావిస్తున్నారు. అయితే తాను అధికారం కోసం అత్యాశతో లేను’’ అని మమతా బెనర్జీ అన్నారు.

Read Also: Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పికి వీసా నిరాకరించిన అమెరికా..

రాత్రంతా ఈ కేసుని పర్యవేక్షించానని, నేరం గురించి తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్‌తో పాటు మహిళ తల్లిదండ్రులతో మాట్లాడానని ఆమె చెప్పారు. మేం ఏం చర్యలు తీసుకోలేదు..? అని ఆమె ప్రశ్నించారు. అత్యాచారంలో నిందితుడిని ఉరిశిక్ష విధించేలా చేస్తామని మహిళ తల్లిదండ్రులతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. లేడీ డాక్టర్ అంత్యక్రియాలు జరిగే వరకు పోలీసులతో తాను టచ్‌లో ఉన్నానని, ఆమె కుటుంబాన్ని పోలీసులు ఎస్కార్ట్ చేశారని, నిందితుడిని పోలీసులు 12 గంటల్లో అరెస్ట్ చేసినట్లు మమతా బెనర్జీ చెప్పారు.

‘‘పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లారు. డీఎన్ఏ పరీక్ష, సీసీటీవీ ఫుటేజ్, ఇతన పరీక్షలు చేసి సమగ్రంగా దర్యాప్తు చేశారు. 12 గంటల్లోనే హంతకుడిని అరెస్ట్ చేశాం’’ అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుని కేసుని సీబీఐకి అప్పగించింది. ‘‘ఏదైనా విచారణ కోసం మీరు సమయం ఇవ్వాలి. నేను ఆదివారం వరకు గడువు విధించాను. సరైన విచారణ లేకుండా మీరు ఎవరిపైనా చర్యలు తీసుకోలేరు. నేను సీనియర్, జూనియర్ డాక్టర్లను గౌవిస్తాను. సరైన విచాణ లేకుండా నేను వ్యక్తుల్ని అరెస్టు చేయలేను’’ అని ఆమె అన్నారు. తాము పూర్తిగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి సీబీఐకి సహకరిస్తామని చెప్పారు.

Show comments