డాక్టర్‌గా, యాక్టర్‌గా రాణిస్తూ.. రాజకీయాల్లో అడుగుపెట్టి ఉన్నత పదవులు అలంకరించినవారు ఎంతో మంది ఉన్నారు.. ఇప్పటికే రాణిస్తూనే ఉన్నారు.. అయితే, వారు అవసరం వచ్చినప్పుడు, అత్యవసరం అయినప్పుడు.. వారి వృత్తికి కూడా న్యాయం చేస్తూనే ఉంటారు.. తాజాగా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఓ బాలుడికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు.. ఏడు నెలల క్రితం రాజ్యాంగ పదవిని స్వీకరించిన తర్వాత కూడా తన వృత్తి పట్ల అతని నిబద్ధతను చాటుకున్నారు.. ఈరోజు ఉదయం 9 గంటలకు హపానియాలోని తన పాత కార్యాలయమైన త్రిపుర వైద్య కళాశాలలో 10 ఏళ్ల బాలుడి నోటి సిస్టిక్ గాయం ఆపరేషన్ కోసం రంగంలోకి దిగారు.. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చిరునవ్వుతో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చారు.
Read Also: Reliance Jio: ఐపీఎల్ లవర్స్‌కు జియో గుడ్‌న్యూస్..
ఇక, సీఎం మాణిక్ సాహాకు డాక్టర్ అమిత్ లాల్ గోస్వామి, డాక్టర్ పూజా దేబ్‌నాథ్, డెంటల్ సర్జరీ మరియు మాక్సిల్లా ఫేషియల్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ రుద్రప్రసాద్ చక్రబర్తి సహాయం అందించారు.. డాక్టర్ స్మితా పాల్, డాక్టర్ కాంచన్ దాస్, డాక్టర్ శర్మిష్ఠ బానిక్ సేన్ మరియు డాక్టర్ బైశాలి సాహా కూడా వైద్య బృందంలో ఉన్నారు. అనస్థీషియా బృందంలో డాక్టర్ కాంగ్‌చాయ్ చౌదరి, డాక్టర్ పరోమితా దాస్ మరియు డాక్టర్ అదితి భట్టాచార్జీ ఉన్నారు. అనంతరం మీడియాతో డాక్టర్ సాహా మాట్లాడుతూ.. శస్త్ర చికిత్స అనంతరం సుకాంత ఘోష్ కుమారుడు అక్షిత్ ఘోష్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. చాలా గ్యాప్ తర్వాత సర్జరీ చేసినా ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొన్నారు.. కాగా, త్వరలోనే త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు సీఎం మాణిక్ సాహా.. అందులో భాగంగానే శస్త్ర చికిత్స కూడా చేసినట్టు తెలుస్తోంది.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమిని ఓడించి అధికారంలోకి వచ్చింది బీజేపీ.. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 36 స్థానాలను కైవసం చేసుకుంది… అయితే, మొదట బిప్లవ్ దేవ్ సీఎం పగ్గాలు చేపట్టారు.. 7 నెలల క్రితం బిప్లవ్ దేవ్‌ను తప్పించి మాణిక్ సాహాను ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ అధిష్టానం.