NTV Telugu Site icon

West Bengal Bypolls: బుధవారం అసెంబ్లీ బైపోల్స్.. టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రపోటీ

By Poly

By Poly

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య మినీ సంగ్రామం జరగబోతుంది. బుధవారం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది. దీంతో రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయంపై రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇంకోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి.

ఇది కూడా చదవండి: Etela Rajender: కేసీఆర్ ఓడిపోతే ఉద్యోగాలు వస్తాయనే కాంగ్రెస్కు ఓటేశారు..

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ ఎక్కువ సీట్లు సాధించడంతో మంచి జోష్‌లో ఉంది. ఇక లోక్‌సభ సీట్లు తగ్గినా తమ సత్తా చాటుకోవాలని కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు. మానిక్‌తలా, రాయ్‌గంజ్, రానాఘాట్ దక్షిణ్, బగ్‌దాహ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరుగనుంది.ఉప ఎన్నికలు జరుగుతున్న 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీఎంసీతో బీజేపీ తలపడుతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నాలుగు సీట్లలో మూడు సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు అధికార టీఎంసీలోకి ఫిరాయించారు. మానిక్‌తాలా ఎమ్మెల్యే, టీఎంసీ నేత సాధన్ పాండే కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న నాలుగు నియోజకవర్గాల్లో మానిక్‌తాలా, రానాఘాట్ దక్షిణ్, బగ్‌దాహ్‌లు సౌత్ బెంగాల్‌లో ఉన్నాయి. పార్టీ దివంగత నేత సాధన్ పాండే భార్య సుప్తి పాండేను మానిక్‌తాలా నుంచి టీఎంసీ ఎన్నికల బరిలోకి దింపింది.

ఇది కూడా చదవండి: Xiaomi SU7: Xiaomi SU7 ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్‌తో 800 కి.మీ రేంజ్..

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు టీఎంసీ 29 సీట్లు గెలుచుకుంది. ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉంది. 2019లో 19 లోక్‌సభ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో 12 స్థానాలకు పడిపోయినప్పటికీ బగ్‌దాహ్, రానాఘాట్ దక్షిణ్, రాయ్‌గంజ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉంది.