TMC Crisis: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. మమత ప్రతిపక్ష నేతగా నియమించిన శోవన్‌దేబ్ చటోపాధ్యాయను తాము ఒప్పుకోబోమని చెబుతూ.. మెజారిటీ ఎమ్మెల్యేలు రీటబ్రత బెనర్జీని తమ నేతగా ఎన్నుకున్నారు. బుధవారం 58 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖను స్పీకర్‌కు సమర్పించడంతో రీటబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇదే కాకుండా మమతకు నమ్మినబంటుగా ఉన్న ఫీర్హాద్ హకీమ్ కోల్‌కతా మేయర్ పదవికి రాజీనామా చేశారు.
బీజేపీలోకి 20 మంది ఎంపీలు:
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఎంపీల్లో కూడా విభజన స్పష్టంగా కనిపిస్తోంది. సమాచారం ప్రకారం దాదాపుగా 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ చర్చలు తీవ్రంగా సాగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం టీఎంసీకి పార్లమెంట్‌లో 28 మంది లోక్‌సభ ఎంపీలు, 13 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మెజారిటీ ఎంపీలు బీజేపీతో చేరితే మమతా బెనర్జీ కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
