తన పిల్లల కోసం ఎంతకైనా తెగిస్తుంది తల్లి.. చివరకు తన ప్రాణాలను సైతం పనంగా పెట్టడానికి కూడా వెనుకడుగు వేయదు.. ఇలాంటి ఘటనలో ఎన్నో చూశాం.. తాజాగా, తన కుమారుడిని ఎత్తుకెళ్తున్న చిరుతను వెంటాడి పోరాటానికి దిగింది ఓ తల్లి.. ఆ బాలుడిని వదిలిపెట్టి.. తనపైకి చిరుత దూసుకొచ్చినా ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా సమరమే చేసింది.. చివరకు తన కుమారుడి కోసం తల్లి చేసిన పోరాటం ముందు క్రూర మృగం తోకముడిచి వెళ్లిపోయింది..
Read Also: ఆ ఎమ్మెల్యేని లేపేస్తే రూ.కోటి ఇస్తా.. డీల్ వీడియో లీక్..!
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీధీ జిల్లా సంజయ్‌గాంధీ నేషనల్ పార్క్ సమీపంలోని బడీ ఝిరియా గ్రామంలో గిరిజన మహిళ కిరణ్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు.. రాత్రి సమయంలో ఒడిలో ఓ పసి బిడ్డకు పాలిస్తూ చపాతీలు చేస్తుంది ఆమె.. మిగతా ముగ్గురు పిల్లలు అక్కడే ఆడుకుంటున్నారు.. అయితే, అక్కడికి వచ్చిన చిరుత ఓ బాలుడిని నోట కరుచుకొని వెళ్లిపోయింది.. ఊహించని ఘటనతో షాక్ తిన్న ఆ తల్లి.. వెంటనే తేరుకుని.. ఒడిలోని పాపను పెద్ద పిల్లలకు అప్పగించి చిరతను వెంబడించింది.. తన కుమారుడి కేకలు వింటూ ఆ వెనుకే ఓ కర్రపట్టుకుని పరుగులు పెట్టింది.. ముళ్లు, పదునైన రాళ్లు గుచ్చుకుంటున్నా లెక్కచేయకుండా చిరతను అనుసరించింది.. దీంతో.. ఒక్కసారిగా వెనక్కి తిరిగిన చిరుత… బాలుడిని వదిలేసి, తల్లిపై దూకింది.. అయినా ఏ మాత్రం వెరవకుండా తెగించి పోరాటం చేసింది ఆ మహిళ.. చివరకు చిరుతను పరుగులు పెట్టించింది.. ఆ తర్వాత రక్తమోడుతున్న బిడ్డను భుజానికి ఎత్తుకొని.. సమీపంలోని ఆస్పత్రిలో చేర్చింది.. ప్రస్తుతం ఆ పసివాడు క్షేమంగా ఉన్నాడు.. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. ఒక్క క్షణం ఆలస్యమైనా.. ఆ చిరుత నా బిడ్డను చీల్చేసేది అంటూ కన్నీరుపెట్టుకుంది.. మొత్తంగా తన బిడ్డపై మమకారంతో.. తెగించి పోరాటం చేసిన ఆ తల్లి ప్రేమ ముందు చిరుత సైతం తోకముడిచింది.