Yogi Adityanath: కన్వర్ యాత్రకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (జూన్ 26న) కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలను కాపాడుకోవడంతో పాటు భక్తుల మనోభావాలను గౌరవించడం అవసరమని నొక్కి చెప్పారు. యాత్ర మార్గంలో బహిరంగంగా మాంసం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, గత సంవత్సరం తప్పనిసరి చేసినట్లుగా దుకాణదారులు తమ షాప్స్ వద్ద వారి పేర్లను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. కన్వర్ యాత్రలో ఊరేగింపు సమయంలో ఎటువంటి అంతరాయాలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తిగా ఉండేలా చూడాలని సూచించారు. అలాగే, ఈ యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.. సామాజిక వ్యతిరేక శక్తులు మారువేషంలో చేరే అవకాశం ఉందని సీఎం యోగి హెచ్చరించారు.
Read Also: Earthquake: పోర్ట్ బ్లేర్ సమీపంలో భూకంపం.. సునామీ సూచన..?
అయితే, సీఎం యోగి ఆదిత్యనాథ్ జారీ చేసిన ఆదేశాలు తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీశాయి. దీనికి మంత్రి జైవీర్ సింగ్ మద్దతు తెలిపారు. కన్వర్ యాత్ర ఒక హిందూ మతపరమైన తీర్థయాత్ర.. ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో దుకాణాలపై పేర్లు రాయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు అన్నారు. ఈ యాత్ర మతపరమైన భావాలతో ముడిపడి ఉంది.. మాంసం దుకాణాలు మూసి వేయబడాలి అని సూచించారు. ఇక, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఫక్రుల్ హసన్ చంద్ ఈ ఆంక్షలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆదేశాలతో చిన్న వ్యాపారులు, రోజువారీ వేతన జీవులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అన్ని దుకాణాలు మూతపడితే, తమ కుటుంబాలను పోషించుకోవడానికి రోజువారీ కూలీలు ఎలా బతుకుతారు?” అని ప్రశ్నించారు. ఇలాంటివి ఏమైనా ఉంటే ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకోకుండా అందరికీ ఒకే విధంగా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Train Tickets Hike: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ.. రైలు టిక్కెట్ ధరలు పెంచొద్దని వినతి!
ఇక, కన్వర్ యాత్రికులకు ముందుగా సౌకర్యాలు- భద్రత కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ సూచించారు. కానీ, యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గ దర్శకాలతో పాటు సూచనలను గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి, ఆయన దాదాపు ఎనిమిది సంవత్సరాలు పదవిలో కొనసాగుతున్నారు.. సుప్రీంకోర్టు అత్యున్నతమైనదని ఆయనకు ఖచ్చితంగా తెలుసు.. కాబట్టి గతంలో కన్వర్ యాత్రపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం పాటించాలని కాంగ్రెస్ నేత తివారీ అన్నారు.
