Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

హైదరాబాద్‌ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్‌ సిటీ వేదికగా ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు జరిగాయి.. ఇప్పుడు విశ్వనగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది.. ఈ నెల 12వ తేదీ నుంచి నోవాటెల్ హెచ్‌ఐసీసీలో ది ఇండస్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (టీఐఈ) గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. 12వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు.. ఇక, ఈ కార్యక్రమానికి అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈవో శంతను నారాయణ్‌, గోయెంకా గ్రూప్‌ సీఈవో, ఎండీ అనిల్‌ కుమార్‌ చలమలశెట్టి హాజరవనున్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు పలు దేశాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు.. అంతర్జాతీయ సదస్సుతో రాష్ట్రంలో స్టార్టప్‌ సంస్కృతి మరింత విస్తరిస్తుందని ఆశాభావం ఇప్పటికే వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్..

తుఫాన్‌పై సీఎం జగన్‌ సమీక్ష..
మాండూస్‌ తుఫాన్‌ తీరం దాటింది.. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్‌ తీరం దాటిందని ఐఎండీ ప్రకటించింది… సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. ఇది కోస్తా తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు నిండడంతో.. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి… బాధితులకు అండగా ఉండేందుకు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. మాండూస్‌ తుఫాన్‌పై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు.. వివిధ జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలు, భారీవర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరిచి.. వారికి అన్నిరకాలుగా అండగా ఉండాలని.. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

ట్రిబుల్ ఐటీ అధికారులపై కేటీఆర్ ఫైర్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో 5 వ స్నాతకోత్సవంలో మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలు పై ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు మంత్రి. మెస్ కాంట్రాక్టర్లను మార్చక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత మంది మంత్రులు, అధికారులు ఉండి కాంట్రాక్టర్లను మార్చక పోవడం ఏమిటని వీసీ ని నిలదీశారు. ఇది సిల్లీ ఇష్యూ..నాణ్యమైన భోజనం పెట్టకుంటే మనమంతా ఉన్నదెందుకన్నారు కేటీఆర్‌. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని, ఎవరైనా ఎక్కువ చేస్తే పోలీసులకు చెప్పి సెట్ చేయండని ఆదేశించారు. టీ.హబ్ ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వైశాలి లవర్‌ కాదు నా భార్య -నవీన్‌
రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రంగారెడ్డి నడిబొడ్డున ఓ యువతి సినిమా తరహాలో కిడ్నాప్ చేసి పోలీసులకు నిర్వాకం సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. సుమారు 100 మందితో పట్టపగలు యువకులతో వెళ్లి ఇంట్లో ఓయువతిని కిడ్నాప్ చేయడంతో ఈసంఘటన సంచలనంగా మారింది. అయితే నవీన్ వైశాలి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. మా వివాహం 2021 ఆగస్టు 4న బాపట్ల జిల్లా వలపర్ల దేవాలయంలో జరిగింది. బిడిఎస్ వరకు పెళ్లి ఫోటోలు బయటకు రాకూడదని వైశాలి కండిషన్ పెట్టిందని, మేము జనవరి 2021 నుండి ప్రేమలో ఉన్నామని నవీన్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈ కిడ్నాప్ కథ ట్వీస్ట్ తిరిగింది.

మళ్లీ సందడిగా మారిన హుస్సేన్‌ సాగర తీరం
హైదరాబాద్​ హుస్సేన్‌సాగర్ తీరంలో కార్ రేసింగ్​ కు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ సన్నద్దతలో భాగంగా.. ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇవాల్టి నుంచి పెట్రోల్ కార్లతో జరిగే రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు పాల్గొననున్నాయి. ఇందులో స్వదేశీ, విదేశీ రేసర్లు ఉన్నారు. పెట్రోల్ కార్లు 240 స్పీడ్‌తో వెళ్తాయని, ఎలక్ట్రిక్ కార్లయితే మాగ్జిమమ్ స్పీడ్ 320 వరకూ ఉంటుందని నిర్వహకులు తెలిపారు. రేసింగ్‌ను 7,500 మంది వరకూ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఒక స్ప్రింట్, మరో ఫీచర్ రేసును నిర్వహిస్తారు.

పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి.. పాక్ హస్తముందా?
పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరన్ తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఈ తెల్లవారుజామున రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తేలికపాటి రాకెట్‌తో ఉగ్రవాదులు దాడి చేశారని వెల్లడించారు. అమృత్‌సర్-భటిండా హైవేలోని సర్హాలి పోలీస్ స్టేషన్‌పై తెల్లవారుజామున 1 గంటలకు దాడి జరిగిందని, భవనానికి స్వల్ప నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాకెట్-లాంచర్-రకం ఆయుధం మొదట స్తంభాన్ని ఢీకొట్టి, ఆపై పోలీసు స్టేషన్‌ను తాకినట్లు వర్గాలు తెలిపాయి. అదృష్టవశాత్తూ ఈ దాడిలో తమ సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని వివరించారు. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉన్న స్టేషన్‌పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర కూడా ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రూపొందించిన కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం విద్యార్థులు మూడేళ్లకు బదులుగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాతే అండర్ గ్రాడ్యుయేట్ ‘ఆనర్స్’ డిగ్రీని పొందగలరు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని యూజీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం పాఠ్యప్రణాళిక, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదా సోమవారం నోటిఫై చేసే అవకాశం ఉంది.దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసింది. వీటి ప్రకారం… నాలుగేళ్ల కోర్సు తీసుకునే విద్యార్థులకు మాత్రమే ఆనర్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు.

అమ్మాయిలందరికీ ఒకే వివాహ వయస్సు..!
ముస్లిం యువతుల వివాహానికి కనీస వయస్సును ఇతర మతాలకు చెందిన వారితో సమానంగా చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా కేంద్రం స్పందించాలని కోరింది. భారతదేశంలో వివాహానికి కనీస వయస్సు ప్రస్తుతం అమ్మాయిలకు 18, పురుషులకు 21 సంవత్సరాలు. అయినప్పటికీ ముస్లిం అమ్మాయిలకు కనీస వివాహ వయస్సు వారు యుక్తవయస్సు వచ్చినప్పుడే అనగా 15 సంవత్సరాలు ఆ వయస్సుగా భావించబడుతుంది. అమ్మాయి రజస్వల అయితే పెళ్లి చేసేయడానికి ముస్లిం మతాచారాలు అనుమతిస్తున్నాయని, ఇది పోస్కో చట్టానికి, ఐపీసీకి విరుద్ధమని మహిళా కమిషన్‌ పేర్కొంది. మతాలతో సంబంధం లేకుండా అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయసుగా నిర్ణయించాలని అభ్యర్థించింది.

ప్రియాంకదే తుది నిర్ణయం!
హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిమాచల్‌లో 68 సీట్లలో 40 గెలిచిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. శాసనసభ పక్షనేత ఎన్నిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం సతీమణి ఎంపీ ప్రతిభా సింగ్, సిక్విందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్ని హోత్రిలు ఉన్నారని తెలుస్తోంది. అధిష్ఠానానికి అధికారం ఇవ్వగా.. ఆదివారం నాటికి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించారు, కొత్త జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు, అనేక ర్యాలీలతో పాటు, ఎన్నికల కోసం వ్యూహాల ప్రణాళికలో కూడా నిమగ్నమై ఉన్నారు.

గూగుల్‌, అమెజాన్‌ నుంచి 30 వేల మంది ఉద్యోగులు ఔట్‌
ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్‌.. మంచి జీతం, కొత్త ఇల్లు.. ఏదైనా కొనగలిగే సమర్థత.. వాయిదాల పద్ధతి కూడా ఉండడంతో.. ఏ వస్తువునైనా కొనేసే ఆర్థికస్తోమత.. అయితే, ఇప్పుడు వారి పరిస్థితి తలకిందులుగా మారిపోయింది… ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందన్న ఆర్ధిక నిపుణుల హెచ్చరికలతో చిన్న చిన్న కంపెనీల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు కాస్ట్ కటింగ్ పేరుతో వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించాయి.. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేడు.. నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే మరిన్ని ఉద్యోగాలు ఉడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.. తాజాగా, గూగుల్ దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. అంతేకాదు రాబోయే నెలల్లో అమెజాన్ కూడా 20,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్టు కొన్ని నివేదికలు చెబుతున్నా్యి.

Exit mobile version