Jagadish Shettar: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. కన్నడ అసెంబ్లీలో 224 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 135, బీజేపీ 66, జేడీయూ 19 స్థానాలల్లో విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు బీజేపీ నుంచి పార్టీ మారిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఓడిపోయాడు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఆయనకు ఓటమిని చవిచూశాడు. లింగాయత్ వర్గానికి చెందిన కీలక నేత అయిన షెట్టర్ గెలుపొందకపోవడం చర్చనీయాంశం అయింది.
అయితే తన ఓటమికి ధనబలం, వ్యూహాలే కారణం అని ఆయన అన్నారు. తన ప్రత్యర్థి ఓటర్లకు రూ.500, రూ. 1000 పంపిణీ చేశారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి మహేష్ తెంగినాకై చేతిలో 34,000 ఓట్ల తేడాలో షెట్టర్ ఓడిపోయాడు. ఇదిలా ఉంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి మారడం వల్ల హస్తం పార్టీకి ప్లస్ అయింది. సంప్రదాయంగా బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్ లు ఈ సారి కాంగ్రెస్ కు ఓటేయడం విశేషం. దీని ఫలితంగా లింగాయత్ బెల్ట్ నుంచి సుమారుగా 20-25 స్థానాలు రావడానికి సహాయపడింది.
Read Also: Congress: కేరళ, తెలంగాణ పొత్తు కదురదు, కానీ.. రాహుల్ గాంధీ సన్నిహితుడి కీలక వ్యాఖ్యలు..
గత ఆరు ఎన్నికల్లో తాను డబ్బును ఉపయోగించలేదని, ఓటర్లకు డబ్బు పంపిణీ చేయలేదని, అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి భారీగా డబ్బులు పంపిణీ చేశారని, ఇలా జరగడం ఇదే మొదటిసారని జగదీష్ షెట్టర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 130-140 మధ్య సీట్లు వస్తాయని వారం క్రితమే చెప్పానని గుర్తు చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, అన్ని కులాలు, అందరు ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తున్నారని వారం క్రితం షెట్టర్ అన్నారు.
తనను ఓడించేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేసిందని, డబ్బు అంశం కీలకంగా మారిందని, హుబ్బళ్లిలో వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారని ఒత్తిడి వ్యూహాలు తన ఓటమికి కారణం అయ్యాయని అన్నారు. బీజేపీ మొత్తం జగదీష్ షట్టర్ ను టార్గెట్ చేసింది, చివరకు ఏమైంది..? రాష్ట్రం మొత్తాన్ని పోగొట్టుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నిలకపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని అన్నారు.