ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ముంబైతో పాటు 28 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.
ఇక ముంబైలో బీజేపీ కూటమి-థాక్రేల కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ జరిగింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగడంతో అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్..
బీజేపీ–శివసేన కూటమి కలిసి 130కిపైగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ–శివసేన కూటమికి 131 నుంచి 151 సీట్లు రావొచ్చు అని అంచనా వేసింది. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 138 వార్డులు దక్కించుకుంటుందని అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: WPL 2026 : ముంబయి కోటను బద్దలు కొట్టిన యూపీ వారియర్స్.!
ఇరవై ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి పోటీ చేసినా ఆశించిన ఫలితం దక్కేలా కనిపించడం లేదు. ఆక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం శివసేన (యూబీటీ)–ఎంఎన్‌ఎస్ కూటమికి 58 నుంచి 68 సీట్లు రావొచ్చని తెలిపింది. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ కూటమికి 59 వార్డులు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పింది. చివరి నిమిషంలో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీతో చేతులు కలిపినా.. కాంగ్రెస్ పరిస్థితి బలహీనంగానే ఉంది. కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 12 నుంచి 16 సీట్లు మాత్రమే దక్కే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Indian Army Day 2026: యుద్ధాల్లో టెక్నాలజీ.. ఇక రణ రంగంలో రోబోలు, అటానమస్ వెహికల్స్!
