Tomato: దేశంలో టమాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమాటా రేటు రూ.250కి చేరింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో అయితే కిలో టమాటా రూ. 150-200 మధ్య పలుకుతోంది. ఈ నేపథ్యంలో టమాటా ధరలకు కళ్లెం వేయాలని కేంద్రం భావిస్తోంది. వినియోగదారుడికి అందుబాటు ధరలో టమాటాను అందించేందుకు సిద్ధమవుతోంది.
Read Also: Gujarat: ఆదర్శ భార్య.. 10 ఏళ్లలో 7 సార్లు భర్తను అరెస్ట్ చేయించి, తానే బెయిల్ ఇప్పించింది..
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాను కొనుగోలు చేసి, ధరలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పంపిణీ చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యలను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది. శుక్రవారం నాటికి ఢిల్లీ రాజధాని ప్రాంతంలో వినియోగదారులకు అందుబాటు ధరల్లో టమాటాలు ఉంటాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీ రాష్ట్రంలో టమాటాల ఉత్పత్తి ఉన్నప్పటికీ దక్షిణ, పశ్చిమ ప్రాంతాల నుంచే 60 శాతం పంట వస్తుంది. ఇతర రాష్ట్రాలకు ఇక్కడ నుంచే నిరంతరం సరఫరా జరుగుతోంది.
డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టమాటా పెద్ద మొత్తంలో పంటకు వస్తుంది. జూలై- ఆగస్టు, అక్టోబర్-నవంబర్ కాలాల్లో తక్కువగా టమాటా పంట ఉంటుంది. టమాటా ధరలు కాలానుగుణంగా మారుతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం అధిక వేడి, రుతుపవనాలు ఆలస్యంగా రావడం పంటను దెబ్బతీశాయి. ప్రతికూల వాతావరణ పరిణామాలు టమాటా ధరలు పెరిగేలా చేశాయి. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి టమాటా సరఫరా జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ దాని సమీపం నగరాలకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుంచి టమాటాల సరఫరా జరుగుతోంది. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కొత్త పంటలు వచ్చే అవకాశం ఉంది. దీంతో రానున్న కాలంలో టమాటా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం తెలిపింది.