Supreme Court: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఎంపీలపై అనర్హత పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని కోరుతూ టీఎంసీ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభలో పార్టీ నేత అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కోర్టు ఈ నోటీసులు పంపింది. ఈ అనర్హత పిటిషన్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అభిషేక్ బెనర్జీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో మొదటి ప్రతివాదిగా ఓం బిర్లా ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేయలేదు.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. అయితే విచారణ సందర్భంగా స్పీకర్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం భావించింది. అయితే, స్పీకర్ తరుఫున తానే హాజరవుతానని సోలిసిటన్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అనర్హత పిటిషన్లపై ఇప్పటికే స్పీకర్‌కు నోటీసులు జారీ అయిన విషయాన్ని కోర్టుకె వెల్లడించారు. దీనిపై జస్టిస్ బాగ్చీ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన అధికారికి ఆదేశాలు జారీ చేయడం తమ ఉద్దేశం కాదని, అయితే అనర్హత విషయంపై నిర్దిష్ట కాలవ్యవధి ఉండాలని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన 20 మంది తిరుగుబాటు ఎంపీలలో సయాని ఘోష్, కాకోలి ఘోష్ దస్తిదార్, సుదీప్ బంద్యోపాధ్యాయ్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, అరూప్ చక్రవర్తి, దీపక్ దేవ్ అధికారి, యూసుఫ్ పఠాన్ తదితరులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత వీరంతా మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. మేలో వీరంతా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో చేరారు. తిరుగుబాటు చేసిన ఎంపీలంతా ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. తిరుగుబాటు చేసిన 20 మంది ఎంపీలను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలని టీఎంసీ కోరుతోంది.

