Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే(టీఎంసీ), పశ్చిమబెంగాల్ మాల్దా జిల్లా అధ్యక్షుడు అబ్దుర్ రహీమ్ భక్షీ చేసిన బెదిరింపు వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఒక బహిరంగ ర్యాలీలో భక్షీ మాట్లాడుతూ.. బీజేపీ నేతల నోటిలో యాసిడ్ పోస్తానని బెదిరించారు. ఆయన సిలిగురి బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యల వివాదస్పదం కావడంతో తాను అలాంటి ప్రకటన చేయలేదని అన్నారు.
Read Also: Thanuja Puttaswamy : నాన్న మూడేళ్లు మాట్లాడలేదు.. చేదు ఘటన చెప్పిన తనూజ
ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ భాషపై జరుగుతున్న అవమానాలకు నిరసనగా టీఎంసీ మాలతిపూర్ పరిధిలోని ఇనాయత్ నగర్లో ర్యాలీ నిర్వహించింది. ‘‘అసెంబ్లీలో ఏ బీజేపీ ఎమ్మెల్యే అయినా బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికులను బంగ్లాదేశీ రోహింగ్యాలు అని పిలిస్తే, వారి గొంతు మూగబోయేలా నేను వారి గొంతులో యాసిడ్ పోస్తా’’ అని బెదిరించారు. బీజేపీ నేతలనను సామాజికంగా బహిష్కరించాలని ప్రజల్ని కోరారు. అవసరమైతే బీజేపీ ఎంపీని కొట్టాలని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలు చంపబడుతున్నారని, స్థానిక బీజేపీ నేతలు మాట్లాడటం లేదని ఆరోపించారు.
టీఎంసీ నేత వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గత కొన్ని ఏళ్లుగా భక్షీ బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ వర్కర్ల చేతులు, కాళ్లు నరికేస్తానని బెదిరించారని చెప్పారు. ఇది టీఎంసీ బెదిరింపు కల్చర్‌ని తెలియజేస్తుందని మండిపడ్డారు. హింస టీఎంసీ రాజకీయ వ్యూహానికి ఒక లక్షణమని అన్నారు. మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు మమతా బెనర్జీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారని మాల్వియా ఆరోపించారు.
