TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టీఎంసీకి చెందిన రూ. 440.42 కోట్ల నిధులు ఉన్న మూడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది. పార్టీ నిధుల ద్వారా భారీ స్థాయిలో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో భాగంగా ఢిల్లీలోని ఐదు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ఇవన్నీ విమానయానరంగంలో పనిచేస్తున్న కేర్‌వెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన ప్రాంతాలని అధికారులు తెలిపారు.
2023 ఏప్రిల్ నుంచి 2026 జూన్ మధ్య టీఎంసీ ఖాతాల నుంచి సుమారు రూ. 160 కోట్లు కేర్‌వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరో అనుబంధ కంపెనీకి బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. దీని తర్వాత ఆ సంస్థల నుంచి రూ. 82.96 కోట్లు కొత్తగా ఏర్పడిన మరో కంపెనీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు దద్యాప్తులో తేలిందని ఈడీ చెప్పింది. ఈ నిధుల్లో రూ. 112 కోట్లతో ఎంబ్రాయర్ లెగసీ 600 విమానం, అగస్టా 109 ఎస్‌సీ హెలికాప్టర్ కూడా కొనుగోలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. హెలికాప్టర్ కొనుగోలులో కొంత విదేశీ నిధులు ఉపయోగించనట్లు అనుమానిస్తోంది.
ఇదిలా ఉంటే, కొనుగోలు చేసిన విమానం, హెలికాప్టర్‌ను తిరిగి టీఎంసీ కాంగ్రెస్‌కే అద్దెకు ఇచ్చి మరోసారి భారీగా నిధుల్ని బదిలీ చేసినట్లు ఈడీ ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారం వెనక అసలు లబ్దిదారులను దాచేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, విదేశీ నిధులు, సంబంధిత కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. విచారణలో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈడీ వెల్లడించింది.

