కేరళ రాష్ట్రంలో ఏటా నిర్వహించే అతి పెద్ద పండుగ త్రిసూర్ పూరం. లాక్ డౌన్ కారణంగా రెండేళ్ళ నుంచి ఈ ఉత్సవం జరగలేదు. ఈ ఏడాది కరోనా కేసులు తగ్గడంతో త్రిసూర్ పూరం ఉత్సవం వైభవోపేతంగా జరుగుతోంది. ఈసారి ఉత్సవంలో లక్షలాదిమంది పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. త్రిస్సూర్ పూరం 18వ శతాబ్ధపు కొచ్చి రాజు శక్తి తంపురాన్ ప్రారంభించిన వార్షిక పండుగగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.
ఈ ఉత్సవం 36 గంటలపాటు సాగుతుంది. ప్రధాన ఉత్సవాలు తెక్కింకాడు మైదానంలో నిర్వహించబడతాయి. త్రిస్సూర్ పూరం అనేది కేరళ వ్యాప్తంగా ఉన్న 10 ఆలయాలకు చెందిన దేవతల సమావేశం గురించింది. కానీ ఇప్పుడు తిరువాంబడి మరియు పరమెక్కావు ఆలయాలు మాత్రమే ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవం అద్భుతంగా అలంకరించబడిన ఏనుగులు, సంగీతం, ఉత్సాహభరితమైన పెద్ద పెద్ద గొడుగుల ప్రదర్శన కుడమట్టొమ్ కు ప్రసిద్ధి చెందింది. కేరళకు చెందిన వారు దేశంలో ఎక్కడ వున్నా త్రిసూర్ పూరం ఉత్సవం నాటికి కేరళకు చేరుకుంటారు.
ఈ ఉత్సవం ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుంది. ఇందులో పాల్గొనే వారు కేరళ సంప్రదాయ వాయిద్యాలను వాయించే ఇలాంజితారా మేళం గురించి ఎదురు చూస్తుంటారు. ఈ వాయిద్యాల ద్వారా ఉత్పన్నమయ్యే లయ ప్రకారం ఉత్సవంలో పాల్గొన్న వారంతా చేతులు ఊపుతూ… వివిధ కదలికలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ మేళాలో అద్బుతమైన బాణా సంచా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.పిల్లా పెద్దా అంతా ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొంటారు. కరోనా వల్ల మొదటిసారి ఉత్సవం రద్దయింది. ఇండో-చైనా యుద్ధం జరిగిన 1962లో కూడా ఈ ఉత్సవం నిరాటంకంగా నిర్వహించారంటే ఈ ఉత్సవానికి వున్న ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు.