JP Nadda: రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత న్యాయ యాత్ర’పై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. సమాజానికి న్యాయం చేయని వాళ్లు ఇప్పుడు ‘న్యాయ యాత్ర’ గురించి ఆలోచిస్తున్నారంటూ ఆదివారం విమర్శించారు. లక్నోలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశిస్తూ.. ఇండియా కూటమిపై ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇండియా కూటమి దేశాన్ని కిందికి లాగేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.
Read Also: Uttar Pradesh: యూపీలో అమానుషం.. కట్నం డబ్బులు తీసుకురాలేదని మహిళను వివస్త్రను చేశారు..
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలను ప్రచారం చేసేందుకు బీజేపీ ‘విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ చేపట్టింది. దీంట్లో పాల్గొనేందుకు నడ్డా యూపీ వచ్చారు. చాలా ఏళ్లుగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు ‘భారత్ జోడో యాత్ర’ను చేశారని, ఇప్పుడు సమాజానికి ఎలాంటి న్యాయం చేయని వ్యక్తులు ‘న్యాయ యాత్ర’ నిర్వహించాలని ఆలోచిస్తున్నారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తుంటే.. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రధాని మోడీ మహిళలు, రైతులు, యువత, పేదలు అనే నాలుగు కులాలను మాత్రమే చూస్తున్నారని, వీరిని బలోపేతం చేస్తే దేశం బలోపేతం అవుతుందని అన్నారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్‌ని గుండాల రాష్ట్రంగా పిలిచే వారిని, కానీ ఇప్పుడు మోడీ, యోగి నేతృత్వంలో అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని నడ్డా అన్నారు.
గతేడాది కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. దీనికి రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ యాత్ర జరిగింది. జనవరి 14 నుంచి ‘భారత్ న్యాయ్ యాత్ర’కి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 67 రోజుల పాటు 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల గుండా ఈ యాత్ర జరగనుంది. 2024 లోక్‌సభ ఎన్నిలక ముందు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచేందుకు హైబ్రీడ్ మోడ్‌లో రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు. మణిపూర్ రాష్ట్రంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర ముంబై వరకు 6200 కిలోమీటర్ల మేర సాగనుంది.