NTV Telugu Site icon

PM Modi: “ఎన్నికల్లో గెలవలేని వారు..” సోనియాగాంధీపై ప్రధాని కామెంట్స్..

Pm Modi

Pm Modi

PM Modi: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికల్లో గెలవలేని వారు, రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులు అయ్యారు.’’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న, సోనియాగాంధీ సిట్టింగ్ స్థానమైన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్ బరేలీని వదిలేసి, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ ఈ ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.

Read Also: Sunita Kejriwal: కేజ్రీవాల్ భార్య సంచలన ఆరోపణలు.. భోజనంపై నిఘా, చంపేందుకు కుట్ర..

రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ పోటీ చేస్తున్న జాలోర్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి లుంబరం చౌదరి తరుపున ప్రధాని మోడీ ఆదివారం ప్రచారం చేశారు. రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలను ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘‘రాజస్థాన్ నుంచి ఒక దక్షిణాది నేతను కాంగ్రెస్ రాజ్యసభకు పంపింది. ఆయన ఎప్పుడూ రాజస్థాన్ గురించి మాట్లాడలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని కూడా రాజ్యసభకు పంపారు. మీరు ఆయనను రాజస్థాన్‌లో చూశారా..? మరి ఇప్పుడు ఎన్నికల్లో పోరాడి గెలవలేని వారిని రక్షించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వచ్చారు.’’ అని సోనియాగాంధీ పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించారు.

ప్రస్తుతం రాజ్యసభకు రాజస్థాన్ నుంచి ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు సోనియా గాంధీ, నీరజ్ డాంగి, రణదీప్ సింగ్ సూర్జేవాలా, KC వేణుగోపాల్, ప్రమోద్ తివారీ, ముకుల్ వాస్నిక్,. అయితే, వీరిలో డాంగీ మాత్రమే రాజస్థాన్‌కి చెందిన వారు. గత రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ని శిక్షించారని అన్నారు.