NTV Telugu Site icon

India: “వారు మాకు మోస్ట్ వాంటెడ్”.. పాక్‌లో ఉగ్రవాదుల హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు..

Mea

Mea

India: పాకిస్తాన్‌లో గత కొంత కాలంగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్‌లో మరణిస్తున్న ఉగ్రవాదులంతా భారత్‌కి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని, వారు భారత న్యాయ వ్యవస్థను ఎదుర్కోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం అన్నారు.

‘‘ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వారు భారత న్యాయవ్యవస్థను ఎదుర్కోవాలని మేము కోరుకుంటున్నాము.. అయితే పాకిస్తాన్‌లో జరిగిన పరిణామాలపై నేను వ్యాఖ్యానించ లేను’’ అని అరిందమ్ బాగ్చీ అన్నారు. 2015 జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్ బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన లష్కరే తోయిబా ఉగ్రవాది హంజ్లా అద్నాన్‌న్ ఇటీవల కరాచీలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో చంపబడ్డారు. డిసెంబర్ 2 మధ్యరాత్రి వేళల్లో హంజ్లా అద్నాన్ తన ఇంటిలోనే కాల్చి చంపబడ్డాడు. ఇలా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.

Read Also: TS Cabinet Meeting: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్

డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులపై ప్రశ్నించినప్పుడు.. భారతదేశం ఎల్లప్పుడూ బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన అన్నారు. అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే యూఎస్, కెనడా అధికారులకు చెప్పామని, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఒక సమస్యపై మీడియా కవరేజీ కోరుకునేందుకే ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు.

మరోవైపు ఖతార్ ప్రభుత్వం భారత మాజీ నేవీ అధికారులు 8 మందికి మరణశిక్ష విధించడంపై మాట్లాడుతూ.. ఈ విషయాన్ని భారత్ నిశితంగా గమనిస్తోందని, అన్ని చట్టపరమైన, కాన్సులర్ సాయాన్ని అందిస్తామని చెప్పారు. జైలులో ఉన్న 8 మందిని కలవడానికి మా రాయబారికి యాక్సెస్ లభించిందని, ఇది చాలా సున్నితమైన సమస్య అని ఆయన చెప్పారు.