NTV Telugu Site icon

Independence Day Celebrations: ఈ సారి పంద్రాగస్టుకు సామాన్యులే చీఫ్ గెస్టులు.. 1800 మందిని ఆహ్వానించిన కేంద్రం

Independence Day

Independence Day

Independence Day Celebrations: ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి వేరే దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించలేదు. దేశంలోని సామాన్యులనే చీప్‌గెస్టులుగా పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే సుమారు 1800 మంది వరకు ఆహ్వానాలను సైతం కేంద్ర ప్రభుత్వం పంపించింది. రేపు ఢిల్లీలో జరిగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సామాన్యులే చీప్‌గెస్టులుగా హాజరవుతున్నారు. వివిధ రంగాల్లో ఉన్న వారిని ముఖ్య అతిధులుగా పిలిచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రేపు ఘనంగా నిర్వహించనున్నారు.

Read also: Rowdy Sheeter: బోరబండలో రౌడీ షీటర్ దారుణ హత్య..!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రేపు పదోసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు ఈ స్వాతంత్య్ర దినోత్సవంతో ముగియనున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం ఉండాలన్న మోడీ భావన నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వివిధ వర్గాలకు చెందిన 1,800 మందిని ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. వారిలో
400 మంది సర్పంచులు, 250 మంది వ్యవసాయ ఉత్పాదక సంఘాలవారు, 50 మంది చొప్పున పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన లబ్ధిదారులు, సెంట్రల్‌ విస్టా, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, హర్‌ఘర్‌ జల్‌ యోజన నిర్మాణ కార్మికులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగం పంచుకోనున్నారు. వారివారి సంప్రదాయ దుస్తుల్లో స్వాతంత్య్రోత్సవాల్లో పాల్గొనడానికి ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 మంది దంపతులను కూడా ఆహ్వానించారు. వేడుకలకు దాదాపు 10వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలు వెయ్యి ఏర్పాటు చేశారు. డ్రోన్లను కూల్చివేసే వ్యవస్థల్ని రంగంలో దించారు. హర్యానాలో ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. వేడుకలు జరిగే సమయంలో ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.

Read also: Virupaksha team : మళ్ళీ జట్టు కట్టిన విరూపాక్ష టీం.. ఈ సారి అంతకు మించి ప్లాన్ చేస్తున్నారుగా

ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్పెషల్‌గా సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలతో ముడిపడిన వాటితో సెల్ఫీలు తీసుకోవడానికి వీలుగా జాతీయ యుద్ధ స్మారక కేంద్రం, ఇండియా గేట్‌, విజయ్‌చౌక్‌, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌, ప్రగతిమైదాన్‌, రాజ్‌ఘాట్‌, మరికొన్ని మెట్రో స్టేషన్ల వద్ద ప్రత్యేక సెల్ఫీపాయింట్లు ఏర్పాటుచేశారు. భారత్‌ పట్ల ప్రపంచం పెట్టుకున్న ఆశలు, వ్యాక్సిన్‌ విజయాలు, యోగా, ఉజ్వల యోజన, అంతరిక్ష రంగంలో ఇండియా సత్తా, డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌ వంటి పథకాలు, ఇతివృత్తాలను వీటికోసం ఎంచుకున్నారు. మైగవ్‌(My Gov) పోర్టల్‌లో ఆగస్టు 15-20 మధ్య ఆన్‌లైన్‌ సెల్ఫీ పోటీలను రక్షణశాఖ నిర్వహిస్తుంది. ప్రజలెవరైనా 12 ప్రసిద్ధ కేంద్రాల వద్ద తీసుకున్న ఒకటి, అంతకుమించిన సెల్ఫీలు అప్‌లోడ్‌చేస్తే అందులో ప్రతి కేంద్రం నుంచి 12 మంది విజేతలను ఎంపికచేసి, వారికి రూ.10వేల చొప్పున నగదు బహుమతిగా అందజేయనున్నారు.