Site icon NTV Telugu

Yogi Adityanath: ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామ ద్రోహులకు మధ్య జరుగుతోంది..

Cm Yogi

Cm Yogi

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గోహత్యను ప్రోత్సహించడం, ముస్లిం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మత ప్రాతిపదికన దేశ విభజన కోసం నిలబడన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాన్ని ‘‘రామద్రోహులు’’గా యోగి అభివర్ణించారు. బీహార్ బెగుసరాయ్ లోక్‌సభ స్థానంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తరుపున ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామద్రోహులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు.

Read Also: Electric Flying Taxi: ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీ.. సింగిల్ చార్జింగ్‌తో 200 కిమీ ప్రయాణం! ఫొటోస్ వైరల్

నేను రాముడి రాష్ట్రం నుంచి వచ్చాను, సీతా దేవి జన్మస్థలమైన బీహార్ ప్రజల హృదయాలతో అయోధ్య ఆలయానికి ప్రత్యేక స్థానం ఉందని తెలుసు అని యోగి అన్నారు. రామద్రోహులు రామ భక్తులపై తూటాలను పేల్చారు, మాఫియా డాన్ మరణానికి సంతాపం తెలిపారని పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీని దుయ్యబట్టారు. 1980వ దశకంలో ఎస్పీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘కరసేవకుల’పై పోలీసులు కాల్పులు జరపడం గురించి యోగి ప్రస్తావించారు. ఎన్డీయే అధికారం చేపట్టకముందే బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ అధర్మానికి కారణమని యోగి నిందించారు. ‘‘ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు ద్రోహం చేస్తూ ముస్లిం రిజర్వేషన్లను కల్పించడం ద్వారా దేశాన్ని మతప్రాతిపదికన విభజించడానికి వారు ప్రణాళికను రూపొందించారు’’ అని ఆరోపించారు. దళితులు, ఓబీసీలకు కేటాయించాల్సిన కోటాను ముస్లింలకు కేటాయిస్తు్న్నారంటూ కాంగ్రెస్‌ని నిందించారు.

గోహత్యలను ప్రోత్సహించే వారిని మనం వ్యతిరేకించాలని అన్నారు. ఎన్డీయేకు ఓటేసి ప్రధాని నరేంద్రమోడీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. మోడీ హయాంలో సరిహద్దుల్లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోయిందని, భారత్ గడ్డపై క్రాకర్స్ పేలినా, పాకిస్తాన్ సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చిందని అన్నారు. భారతదేశం డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తే, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి మళ్లీ లాంతర్ యుగానికి తీసుకెళ్లాలని చూస్తున్నాయని ఆరోపించారు. యూపీలో 80 స్థానాలు గెలుచుకునేలా చూస్తున్నానని, బీహార్ కూడా ఎన్డీయేకి మెజారిటీ సీట్లు కట్టబెట్టాలని యోగి ప్రజల్ని కోరారు.

Exit mobile version