UtterPradesh: ఓ చిన్నారి కాల్వలో పడిపోయింది. చాలా సేపటి వరకు ఎలాంటి చలనం లేకుండా నీటిపై నిర్జీవంగా కనిపించింది. దీంతో ఆ చిన్నారి చనిపోయిందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బాలికను పోస్ట్‌మార్టం కోసం తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బాలిక కుటుంబసభ్యులు ఒక్కసారి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని పోలీసులను ప్రాధేయపడ్డారు. వారి అభ్యర్థన మేరకు ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్లకు చూపించారు. పరిశీలించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అందించగానే.. చిన్నారి మళ్లీ ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. అనూహ్యమైన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపుర్ జిల్లాలో జరిగింది.
Read also: Extramarital Affair: వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊస్ట్.. చైనా కంపెనీ నిర్ణయం
సంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలాన్ హద్వా గ్రామానికి చెందిన భోళాకు రవీన అనే కుమార్తె ఉంది. అ అమ్మాయికి మతిస్థిమితం లేదు. ఆ బాలిక.. ఆదివారం కనిపించకుండా పోయింది. చిన్నారి కోసం కుటుంబసభ్యులు సుమారు రెండు గంటల పాటు వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు ఈ విషయం గురించి గ్రామ పంచాయతీ సభ్యుడు మనీశ్‌కు తెలియజేయడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉన్న సిర్సీ కాల్వలో బాలికను కనుగొన్నారు. కాల్వలో అచేతనంగా పడి ఉన్న బాలికను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ చిన్నారి మృతిచెందినట్లుగా నిర్థారించిన పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలిక కుటుంబసభ్యులు.. ఆమె మానసిక స్థితి గురించి పోలీసులకు వివరించారు. ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని వేడుకున్నారు. వారు కోరినట్టుగానే స్థానికంగా ఉన్న పటెహ్రా ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి బాలికను పోలీసులు తీసుకెళ్లారు.
Read also: Balkampeta Ellamma Kalyanam: నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
ఆరోగ్య సంరక్షణా కేంద్రంలో చికిత్స అందిస్తున్న సమయంలో బాలిక స్పృహలోకి వచ్చిందని డాక్టర్ గణేశ్ శంకర్ త్రిపాఠి తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు ఆమె గుండె పనితీరు పరిశీలించగా.. సాధారణంగా ఉందని చెప్పారు. చికిత్స అనంతరం బాలిక పూర్తిగా కోలుకోవడంతో కుటుంబసభ్యుల్లో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. చనిపోయిందని భావించిన బాలిక తిరిగి ప్రాణం పోసుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. మతిస్థిమితం లేకపోవడంతోనే ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయి ఉంటుందని అందుకే అలా జరిగిందని వైద్యులు తెలిపారు.
