The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ మతమార్పిడులు, లవ్ జీహాద్, ఉగ్రవాదం కోణంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ సీపీఎం పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి సినిమాను నిర్మించారని దుయ్యబడుతున్నారు.
Read Also: Swiggy: స్విగ్గీ బాదుడు షురూ.. ఫుడ్ ఆర్డర్‌పై ఛార్జ్.. తొలుత ఈ నగరాల్లోనే అమలు..
ది కేరళ స్టోరీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రోడక్ట్ అంటూ.. ఆర్ఎస్ఎస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ మత ఉద్రిక్తతలను పెంచేందుకే ఇలాంటి ప్రచారాలను వ్యాప్తి చేస్తోందని మూవీని ఉద్దేశించి అన్నారు. ఫేక్ కథనాలు, సినిమాల ద్వారా విభజన రాజకీయాలను వ్యాప్తి చేసేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని, ఎలాంటి వాస్తవాలు లేకుండా, సంఘ్ పరివార్ అపోహలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లాం మతంలోకి చేరి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలో చేరారనేది పెద్ద అబద్ధం అని కొట్టి పారేశారు.
‘ది కేరళ స్టోరీ’కి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. కేరళ రాష్ట్రం నుంచి 32,000 మహిళలు తప్పిపోయిన కథ ఆధారంగా, మత మార్పిడి, ఉగ్రవాదం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ముస్లింలను సమాజం నుంచి వేరు చేసేలా ఈ సినిమాను రూపొందించారని పినరయి విజయన్ అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ అనేది సమాజంలో విషం చిమ్మడానికి లైసెన్స్ కాదని, ఈ చిత్రం రాష్ట్రంలోని మత సామరస్యాన్ని నాశనం చేసే ప్రయత్నం అని సీపీఎం, కాంగ్రెస్ ఆరోపించాయి. ఈ వివాదాస్పద సినిమా ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది.