Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’ అని రాహుల్ గాంధీ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, సంత్ కబీర్ ఆలోచనల్ని కలిగి ఉందని అన్నారు. పాట్నాలో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’ కార్యక్రమంలో రామహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ పార్టీ నేత సుధాన్షు త్రివేది రాహుల్ గాంధీని ఎగతాళి చేస్తూ.. ఆయన తన ‘జ్ఞానం’తో దేశాన్ని షాక్‌కి గురిచేస్తున్నారని, నోట మాట కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు. 1947లో రాజ్యాంగం రూపొందించలేదని, కేవలం రాజ్యాంగ రూపకల్పన కార్యక్రమాలు మొదలయ్యాయనే విషయం కూడా రాహుల్ గాంధీకి తెలియలేదని అన్నారు. నవంబర్ 26, 1949న రాజ్యాంగం ఖరారందని, అందుకే ఈ తేదీని ప్రధాని మోడీ రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారని చెప్పారు.
Read Also: Srinivasa Reddy: ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేసి పేదల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారు
ఇది తెలియని వారి కోసమే రాజ్యాంగ దినోత్సవం అవసరమైందని, కాంగ్రెస్ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా స్వాగతించడం లేదని, వ్యతిరేకిస్తోందని త్రివేది అన్నారు. రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం ఎప్పుడు ఏర్పడిందో తెలియని వారి జాబితాలో చేరారని, అందుకు ఆయన వెయ్యి సంవత్సరాల పురాతనమైందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కూడా రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ తన ఆత్మకథను రాస్తే దానికి ‘‘ఫెయిల్యూర్ టూ లాంచ్’’ అనే పేరు ఉంటుందని అన్నారు. రాజ్యాంగం ఎప్పుడు రాయబడిందో, అమలు చేయబడిందో తెలియని రాహుల్ నేడు కాంగ్రెస్‌కి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 55 కంటే ఎక్కువ ఎన్నికల్లో ఓడిపోయిందని, 400 కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు పార్టీని విడిచిపెట్టారని అన్నారు. ప్రధాని కావాలని కలలు కంటున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి తెలియకపోవడం సిగ్గుచేటని బీజేపీ నేత అజయ్ అలోక్ అన్నారు.
