NTV Telugu Site icon

Agnipath: సుప్రీం కోర్టుకు చేరిన అగ్నిపథ్ వివాదం

Supreme Court

Supreme Court

కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ స్కీమ్ ‘ అగ్నిపథ్’పై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్,  తెలంగాణ, హర్యానాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ ఆందోళనలకు పాల్పడ్డారు. బీహార్ లోని పలు జిల్లాల్లో గత మూడు రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రైళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. శుక్రవారం తెలంగాణలో కూడా అల్లర్లు జరిగాయి. సికింద్రాబాద్ స్టేషన్ లో ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లో ఒక యువకుడు మరణించాడు.

ఇదిలా ఉంటే తాజాగా ‘అగ్నిపథ్’ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలను విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసేలా ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. రైల్వేతో పాటు ప్రజా ఆస్తులకు జరిగిన నష్టాలను విచారించాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకం వల్ల జాతీయ భద్రత, సైన్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలించడానికి రిటైర్డ్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా పిటిషన్ దారులు సుప్రీం కోర్టును కోరారు.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా హైఅలెర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లలో నిఘాను పెంచారు. ఆందోళనకారులు రైల్వేలను టార్గెట్ చేస్తుండటంతో ఏపీలో పాటు తెలంగాణలో పలు రైల్వే స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్త్ పెరిగింది. ఇప్పటికే హర్యానా, బీహర్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేయడంతో పాటు బందోబస్త్ ను పెంచారు.