భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం అయిన ఈశా గ్రామోత్సవం యొక్క 16వ ఎడిషన్, కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఆదియోగి ఎదుట డిసెంబర్ 29, 2024న అద్భుతంగా ముగిసింది. ఈశా గ్రామోత్సవం అనేది రెండు నెలల పాటు సాగే క్రీడల మహోత్సవం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలోని గ్రామాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని పలు గ్రామాల్లో నిర్వహించబడింది. ఇక ఈ ముగింపు వేడుకలో సద్గురు మాట్లాడుతూ, ఈ ఉత్సవాన్ని మరింత విస్తృతం చేయాలనే ఆలోచనను పెంచుకున్నారు. ఆ ఆలోచనను X వేదికగా ఇలా వెల్లడించారు, “ఈశా గ్రామోత్సవం భారతదేశపు గ్రామీణ స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నం. చిన్న ఈవెంట్గా మొదలై, నేడు ఐదు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి విస్తరించి, మొత్తం లక్షకు పైగా ఆటగాళ్లు, ప్రేక్షకులు మరియు నిర్వాహకులు పాల్గొన్నారు. అయితే ఇది చాలదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇది జరగాలని మా ఆకాంక్ష.” అని అన్నారు.
Nurse Nimisha Priya: యెమెన్‌లో నిమిష ప్రియకు మరణశిక్ష.. అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు
క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ సద్గురు ఆలోచనను, ఈ పండుగ లక్షలాది మందికి అందిస్తున్న ఆనందాన్ని కొనియాడారు. “డెబ్బై ఐదేళ్ల అమ్మ స్కూలు పిల్లల్లా ఉత్సాహంగా ఆడటం చూస్తుంటే మనసు పులకించింది. వయసు, కులం, నేపథ్యం అనే తేడాలన్నీ పక్కనపెట్టి, మీరంతా ఆడిన తీరు, మీ ఉత్సాహం, జోష్ నిజంగా స్ఫూర్తిదాయకం.” అని అన్నారు. తన సరదా శైలికి పేరుపొందిన ఈ దిగ్గజ క్రికెటర్, “అక్కలు ఉత్సాహంగా త్రోబాల్ ఆడే తీరుని చూసి నేను హక్కా బక్కా (ఆశ్చర్యపోయానన్నారు) అయిపోయాను” అని చమత్కారంగా అన్నారు. అందరూ ఊహించినట్లుగానే, పురుషులు వాలీబాల్, మహిళల త్రోబాల్ ఫైనల్స్ పోటాపోటీగా సాగాయి. ఈ రెండింటిలో కర్ణాటక, తమిళనాడు జట్లు విజేతలుగా నిలిచాయి. దివ్యాంగుల మధ్య జరిగిన పోటీలు కూడా అంతే ఉత్సాహభరితంగా సాగి, ఈ ఉత్సవం అందరినీ సమానంగా ఆహ్వానిస్తుందనే విషయాన్ని మరోసారి నిరూపించాయి.
మొత్తం యాభై రెండు లక్షల ప్రైజ్మనీలో భాగంగా, విజేత జట్లకు ఐదు లక్షల రూపాయలు అందజేయడంతో ఈ ఉత్సవం ఘనంగా ముగిసింది. 16వ ఈశా గ్రామోత్సవం 162 గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించబడింది. 43,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 10,000 మందికి పైగా గ్రామీణ మహిళలు చాలామంది గృహిణులు వాలీబాల్ మరియు త్రోబాల్ పోటీపడ్డారు. 2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ సమాజంలో క్రీడా స్ఫూర్తిని మరియు ఆటపాటల సంతోషాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే ప్రొఫెషనల్ క్రీడాకారులను పక్కన పెట్టి, కూలీలు, మత్స్యకారులు, గృహిణులు వంటి సామాన్య పల్లె ప్రజలకు వేదిక కల్పిస్తుంది. దీని ద్వారా వారు రోజువారీ జీవితం నుండి కాసేపు దూరంగా, క్రీడల ద్వారా వచ్చే ఆనందాన్ని, ఐకమత్యాన్ని అనుభవించే అవకాశం పొందుతారు.