తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయి. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ స్థాపించిన పార్టీ టీవీకే అనూహ్యంగా 100కు పైగా సీట్లతో దూసుకెళ్తుండడంతో మార్కెట్లలో కూడా ప్రభావం కనిపించింది. ఇదే సమయంలో Sun TV Network షేర్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి బీఎస్ఈలో సన్ టీవీ షేరు ధర 6.90 శాతం పడిపోయి రూ.563.25 వద్ద ట్రేడవుతోంది. రోజు మొత్తం చూస్తే దాదాపు 10 శాతం వరకు క్షీణించింది.
సన్ టీవీ షేర్లు ఎందుకు పడిపోయాయి?
సన్ టీవీ నెట్‌వర్క్, మీడియా దిగ్గజం కళానిధి మారన్ ఆధ్వర్యంలోని సన్ గ్రూప్‌లో భాగం. కళనిధి మారన్ కుటుంబానికి తమిళనాడు అధికార పార్టీ డీఎంకేతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన, మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి మనవడు కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు. అందువల్ల, ఎన్నికల్లో డీఎంకే బలహీనపడటం లేదా TVK బలపడటం వంటి సంకేతాలు మార్కెట్లో సన్ టీవీపై ప్రతికూల ప్రభావం చూపించాయి. పెట్టుబడిదారులు రాజకీయ మార్పులు కంపెనీ వ్యాపార ప్రయోజనాలపై ప్రభావం చూపవచ్చని భావించి షేర్ల విక్రయాలకు దిగారు.
తమిళనాడు ఎన్నికల ట్రెండ్స్
ఎన్నికల ధోరణుల ప్రకారం, మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో:
TVK – 108 స్థానాల్లో ఆధిక్యం
DMK – 56 స్థానాల్లో ఆధిక్యం
AIADMK కూటమి – 69 స్థానాల్లో ముందంజ
PMK – 6 స్థానాల్లో ఆధిక్యం
CPI – 2 స్థానాల్లో ఆధిక్యం
ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1967 తర్వాత తొలి పెద్ద రాజకీయ మార్పు?
తమిళనాడు రాజకీయాల్లో 1967 నుంచి ప్రధానంగా రెండు ద్రావిడ పార్టీలైన DMK, AIADMKలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. C. N. Annadurai స్థాపించిన DMK, తర్వాత M. G. Ramachandran ఏర్పాటు చేసిన AIADMKలు రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేశాయి. అయితే, విజయ్ పార్టీ TVK బలమైన ప్రదర్శనతో ఈ సుదీర్ఘ రాజకీయ సమీకరణం మారబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే కారణంగా తమిళనాడు రాజకీయాలతో పాటు స్టాక్ మార్కెట్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది.
