NTV Telugu Site icon

NIA: ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలుగు యువకులు.. నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలు..

Nia

Nia

NIA: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. ఈ సంస్థలో సంబంధాలు ఉన్న వ్యక్తుల కోసం వేటాడుతోంది. ఇదిలా ఉంటే ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు ఎన్ఐఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేరళతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు, కీలక నేతలపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలకు చెందిన ముగ్గురి కోసం పారితోషకం ప్రకటించింది. వీరికి సంబంధించిన సమాచారం ఇస్తే పారితోషకం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Read Also: Rohit Sharma: ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ ఫ్యాన్స్ షాక్..

తెలంగాణ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్ నెల్లూర్ జిల్లాకి చెందిన షేక్ అహ్మద్ గురించి సమాచారం తెలిసిన వారు వాట్సాప్ నెంబర్ 9497715294కి తెలియజేయాలని ఎన్ఐఏ కోరింది. తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది.

పీఎఫ్ఐ సంస్థ ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తుండటంతో గతేడాది సెప్టెంబర్ నెలలో ఎన్ఐఏ, ఈడీలు ఏకకాలంలో ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోని 100కి పైగా ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కర్నూలు, నెల్లురులో దాడులు నిర్వహించారు. పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురితో పాటు కేరళలో 11 మంది, కర్ణాటకలో ఐదుగురు, తమిళానాడులో ఐదుగురిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది ఎన్ఐఏ.