తెలంగాణ గడ్డపై మరో కొత్త ఆవిర్భవించనుంది.. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన గులాబీ పార్టీ.. ఇప్పుడు జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతోంది.. టీఆర్ఎస్‌ను కాస్తా బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మారుస్తూ ఇవాళ తీర్మానం చేయబోతున్నారు.. జాతీయ పార్టీకి ఏ పేరు పెట్టాలన్న దానిపై కొన్ని పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు బీఆర్‌ఎస్‌కే గులాబీ దళపతి మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.. మొత్తంగా ఇవాళ తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. అదీ జాతీయ పార్టీ కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్… భారత రాష్ట్రీయ సమితిగా మారే క్షణాల కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. కేసీఆర్ ఏర్పాటు చేయబోయే బీఆర్ఎస్‌పై ఇప్పటికే పెద్ద చర్చ సాగుతోంది. ప్రత్యామ్నాయ అజెండా పేరుతో.. బీజేపీని ఎదుర్కొనేందుకు జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కొద్దికాలంగా గులాబీ దళపతి కసరత్తు చేస్తున్నారు. అది కొలిక్కి వచ్చింది. పార్టీ నేతలతో దఫదఫాలుగా సంప్రదింపులు జరిపిన ఆయన.. ఇవాళ కీలక ప్రకటన చేయబోతున్నారు.
Read Also: Rename TRS to BRS: నేడే జాతీయ పార్టీ ప్రకటన.. గులాబీ దళంలో జోష్
నేషనల్ హైవేపే కారును పరుగెత్తించాలని గతంలో కూడా ప్రయత్నించారు కేసీఆర్. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే జాతీయ స్థాయిలో దళపతి ఆలోచనలో సాగాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో.. ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. కేంద్రం నుంచి తెలంగాణకు సరైన సహకారం అందడం లేదని.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపిస్తున్న కేసీఆర్. బీజేపీపై తీవ్రస్థాయి పోరాటానికి పిలుపు ఇచ్చారు. దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని బలంగా కోరుకుంటున్న సీఎం కేసీఆర్.. కొద్దికాలంగా వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ప్రగతిభవన్‌కు వచ్చిన సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులతోపాటు.. పలు పార్టీల నాయకులు.. ఉత్తర భారతానికి చెందిన రైతులతో సుదీర్ఘ మంతనాలు చేశారు. అంతేకాదు.. వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడి వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షపార్టీల అభ్యర్థికే మద్దతు తెలిపి.. జాతీయ స్థాయిలో తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు కేసీఆర్.
జాతీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం కుదరడంతో.. కేసీఆర్ చేయబోయే ప్రకటనపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక జరగబోతుంది. ఆ ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకున్న కేసీఆర్.. జాతీయ పార్టీ బీఆర్ఎస్‌పైనే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. జాతీయపార్టీగా మారిన తర్వాత బీఆర్ఎస్ ఎదుర్కోబోయే తొలి ఎన్నిక మునుగోడే అవుతుంది. టీఆర్ఎస్.. బీఆర్‌ఎస్‌గా మారినా.. పార్టీ జెండా రంగు.. గుర్తు మార్చడం లేదు. దీంతో ప్రజల్లో గందరగోళానికి తావు ఉండబోదని ఆశిస్తున్నారు. ఇక, జాతీయ పార్టీ ఏర్పాటు సరే..! అసలు పార్టీ కూర్పు ఎలా ఉంటుంది? టీఆర్ఎస్‌కు ఉన్నట్టే బీఆర్ఎస్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారా? వివిధ రాష్ట్రాలకు ఎవరిని కోఆర్డినేటర్లుగా నియమిస్తారు? ఎన్ని రాష్ట్రాలకు బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్తారు? ప్రస్తుతం టీఆర్ఎస్‌లో సీనియర్లుగా ఉన్నవారికే బాధ్యతలు అప్పగిస్తారా లేక ఆయా రాష్ట్రాల్లోని స్థానిక నేతలను ఎంపిక చేస్తారా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం గులాబీ శిబిరంలో ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే, ఇవాళ పార్టీ పేరు, జెండా, అజెండా ఖరారు చేసినా.. మిగతా వాటిపై క్లారిటీ రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.
* భారత రాష్ట్ర సమితి అని పిలవబడే అవకాశం ఉన్న పార్టీని ప్రారంభించేందుకు ఈరోజు మధ్యాహ్నం 1:19 గంటలకు ముహూర్తం సెట్ చేశారు కేసీఆర్..
* ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులతో పాటు పార్టీ 33 జిల్లాల అధ్యక్షులతో సమావేశమై చర్చించారు.. జాతీయ పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై చర్చించినట్టు సమాచారం.
* కొత్త పార్టీ కోసం రూ.100 కోట్ల విలువైన 12 సీట్ల ఎయిర్‌క్రాఫ్ట్‌ను కొనుగోలు చేసిన గులాబీ పార్టీ..
* నవంబర్ లో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న తొలి ఎన్నిక…
* గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
* హైదరాబాద్‌లో జరిగే సమావేశం తర్వాత కేసీఆర్ తన పార్టీ ఎజెండాను కూడా వెల్లడించే అవకాశం..
* పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు కలిపి మొత్తం 283 మంది హాజరుకానున్నారు.
* పార్టీ తన ఎన్నికల గుర్తు కారును అలాగే గులాబీ రంగును కూడా నిలుపుకోవాలని కోరుకుంటోంది,