Site icon NTV Telugu

Bihar Politics: ఆర్జేడీ ఘోర పరాజయం, ప్రతిపక్ష నేత పదవిని తిరస్కరించిన తేజస్వీ యాదవ్.!

Bihar Politics

Bihar Politics

Bihar Politics: బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని ముందుండి నడిపించిన, సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్ ఒకానొక దశలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది, చివరకు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ కేవలం 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మహాఘట్బంధన్ కూటమి కేవలం 35 సీట్లను మాత్రమే సాధించింది. మరోవైపు, ఎన్డీయే కూటమి 202 స్థానాలు కైవసం చేసుకుంది. నితీష్ కుమార్ సీఎంగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

Read Also: Sheikh Hasina: ఉరిశిక్ష పడిన ‘‘షేక్ హసీనా’’ను భారత్ బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా.?

ఇదిలా ఉంటే, ఈ ఘోర పరాజయం తర్వాత తేజస్వీ యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన తండ్రి లాలూ పట్టుబట్టడంతో ఈ పదవిని చేపట్టడానికి అంగీకరించారు. నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో తాను ఎమ్మె్ల్యేగానే కొనసాగుతానని, ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, లాలూ మాత్రం సభలో పార్టీని నడిపించాలని తేజస్వీని కోరారని చెప్పారు.

ఆర్జేడీ ఓటమికి కూడా తేజస్వీ యాదవ్ తానే బాధ్యత తీసుకున్నాడు. ఈ ఎన్నికల్లో చాలా ప్రయత్నించానని, కానీ విఫలమయ్యానని అన్నారు. అయితే, సమావేశంలో సీనియర్ నాయకులు తేజస్వీ యాదవ్‌ వెంటే ఉన్నామని, అతడితోనే ఉంటామని చెప్పారు. తేజస్వీ యాదవ్ సన్నిహితుడు, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ ఈ సమావేశంలో ఆయనను సమర్థించారు. ఇటీవల, లాలూ ఫ్యామిలీ డ్రామాలో సంజయ్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపించింది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య, ఇటీవల తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లు చెప్పింది. దీనికి సంజయ్ యాదవ్ రమీజ్ నేమత్ ఖాన్‌లు కారణమని వెల్లడించింది.

Exit mobile version