Triple Talaq: కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తన భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’ చెప్పాడు. రైలు ఝాన్సీ జంక్షన్ రాగానే రైలు నుంచి దిగి పరారయ్యాడు. దీంతో షాక్‌కి గురైన భార్య రైల్వే పోలీసుల్ని ఆశ్రయించింది. ఏప్రిల్ 29న మహ్మద్ అర్షద్(28) తన భార్య అఫ్సానా(26)లు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ట్రిపుల్ తలాక్ చెప్పిన తర్వాత అఫ్సానాపై దాడి చేసి రైలు అర్షద్ పారిపోయాడు.
Read Also: Kannappa: ‘కన్నప్ప’ షూట్ పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్..
ఈ సంఘటనపై అఫ్సానా రైల్వే పోలీసుల్ని ఆశ్రయించింది. ఆమెను తిరిగి కాన్పూర్ దేహాత్‌లోని పుఖ్రాయన్‌కి తిరిగి పంపారు. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. భోపాల్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అర్షద్ ఈ ఏడాది జనవరి 12న రాజస్థాన్ కోటకు చెందిన గ్రాడ్యుయేట్ అఫ్సానాను వివాహం చేసుకున్నాడు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఈ సంబంధం కుదిరింది.
అయితే, గత వారం పుఖ్రాయన్‌లోని అర్షద్ ఇంటికి వెళ్లిన సమయంలో అతనికి అప్పటికే వివాహమైందని అఫ్సానాకు తెలిసింది. ఆ తర్వాత నుంచి అతని తల్లి కట్నం కోసం వేధించడం ప్రారంభించిందని ఫిర్యాదులో పేర్కొంది. చివరకు రైలులో ప్రయాణించే సమయంలో ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అఫ్సానా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనకు సాయం చేరాలని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహిళలకు విడాకులు ఇచ్చి వారిని విడిచిపెట్టిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అఫ్సానా సీఎం యోగికి విజ్ఞప్తి చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త అర్షద్, అతని మామ అకీల్, తండ్రి నఫీసుల్ హసన్, తల్లి పర్వీన్‌లపై కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ (సిఓ) ప్రియా సింగ్ తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.