Shiv Sena: మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంఎల్సీ మనీషా కయాండే ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. శివసేన వ్యవస్థాపక దినోత్సవం రోజునే మనీషా కయాండే షిండే వర్గంలో చేరిపోయింది. రెండు రోజుల్లో వరసగా ఉద్దవ్ వర్గానికి రెండు షాక్ లు తగిలాయి. మనీషా కయాండే శివసేన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. అంతకుముందు రోజు కీలక నేత శిశిర్ షిండే ఠాక్రే వర్గం నుంచి షిండే వర్గంలో చేరిపోయారు.
ఉద్ధవ్ వర్గాన్ని విడిచి నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారనే దానిపై ఆయన వర్గం ఆత్మపరిశీలన చేసుకుంటుందో లేదో చూడటానికి తాను ఒక ఏడాది పాటు వేచి ఉన్నానని కయాండే అన్నారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బాలాసాహెబ్ ఠాక్రేకు చెందిన అసలు సేన అని ఆమె అన్నారు. షిండే ప్రభుత్వం గత జూన్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమర్ధవంతంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే కయాండే ప్రశంసించారు. ఎన్సీపీ, కాంగ్రెస్ ఎజెండాలను ప్రచారం చేసినందుకు ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్, సుష్మా అంధారేలపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kedarnath: కేదార్‌నాథ్‌లో బంగారం కుంభకోణం.. పూజారి ఆరోపణతో కలకలం..
ప్రతీరోజు ఉదయం ఇతరులను విమర్శిస్తూ.. కాంగ్రెస్, ఎన్సీపీల ఎజెండాను ముందు తీసుకువచ్చి, హిందూ దేవీదేవతలకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు శివసేనకు చెందిన వారు కాలేరని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే కయాండే షిండే వర్గంలో చేరే కొన్ని గంటల ముందు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ థాకరే వర్గం ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించింది. తాను ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, ఉద్ధవ్ పార్టీ మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తోందని సంచనల ఆరోపణలు చేశారు.
2012లో శివసేన పార్టీలో చేరారు మనీషా కయాండే. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేన పొత్తుపై పార్టీలో ఎవరూ అనుకూలంగా లేరని ఆమె అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అయిన ఆమె పదవీ కాలం జూలై 27, 2024న ముగుస్తుంది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహా వికాస్ అఘాడి ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ, ఠాక్రే అధికారం కోసం తన సిద్ధాంతాన్ని రాజీ చేసుకున్నారని షిండే అన్నారు. శివసేన-బిజెపి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిజమైన కృషి చేస్తోందని, గత ఎంవిఎ ప్రభుత్వం ఆపివేసిన ప్రాజెక్టులను వేగవంతం చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.
