NTV Telugu Site icon

Supreme Court: టీచర్ బలవంతంగా విద్యార్థినికి ఫ్లవర్స్ ఇవ్వడం లైంగికంగా వేధించడమే..

Supreme Court

Supreme Court

Supreme Court: విద్యార్థినికి బలవంతగా పువ్వులు తీసుకోవాలని టీచర్ కోరడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికకు ఇతరుల ముందు పువ్వులు ఇచ్చి, వాటిని తీసుకోవాలని బలవంతం చేయడం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ ఇచ్చే (పోక్సో)చట్టం కిందకు వస్తుందని చెప్పింది. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడి ప్రతిష్టపై సంభావ్య ప్రభావాన్ని గుర్తిస్తూ, సాక్ష్యాధారాలను కఠినంగా పరిశీలించాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెబుతూ, అతనికి విధించిన మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేసి నిర్దోషిగా ప్రకటించింది.

వేధింపులకు గురైన మైనర్ విద్యార్థిని, సాక్షులు ఇచ్చిన సాక్ష్యాధారాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని బెంచ్ గుర్తించింది. టీచర్‌తో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి బాలికను పావుగా వాడుకునే అవకాశంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి అమ్మాయికి చెందిన బంధువులకు, సదరు ఉపాధ్యాయుడికి కొన్ని విషయాలపై వివాదం ఉందని కోర్టు గుర్తించింది. దీంతో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.

Read Also: BRS Leaders: భూ కబ్బారాయుళ్లపై సర్కార్‌ యాక్షన్‌.. అధిబాట్లలో 38 మందిపై కేసులు..!

జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. టీచర్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించిన తమిళనాడు ట్రయల్ కోర్టు, మద్రాస్ హైకోర్టు విధించిన నేరారోపణలను ధర్మాసనం తోసిపుచ్చింది. లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన కేసులలో, ముఖ్యంగా ఉపాధ్యాయుని ప్రతిష్ట ప్రమాదంలో ఉన్నప్పుడు సమతుల్య నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది. సమాజంలో ఆడపిల్లల్ని సురక్షితంగా ఉంచడంలో టీచర్ల పాత్ర కీలకమైనదని వ్యాఖ్యానించింది.

ఒక విద్యార్థిని ఎవరైనా ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుకు గురిచేస్తే అతి తీవ్ర నేరాల జాబితాలో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ తరుపు సీనియర్ న్యాయవాదితో తాము ఏకీభవిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. పాఠశాల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే పోక్సో చట్టం కింద నిబంధనలు అమలులోకి వస్తాయని జస్టిస్ దత్తా తీర్పు చెప్పారు. అయితే, ఉపాధ్యాయుడి ప్రతిష్ట ప్రమాదంలో ఉన్నప్పుడు, మైనర్ బాలిక పావుగా వాడుకుని ఉపాధ్యాయుడి పరువు తీయడాన్ని అనుమతించకూడదని కోర్టులు తెలుసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.