పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన సమావేశాలు డిసెంబర్ 19నతో ముగిశాయి. 19 రోజుల పాటు జరిగిన సమావేశాలు… ఆందోళనలు.. నిరసనలతోనే ముగిశాయి. ఇక చివరిలో ‘జీ-రామ్-జీ’ బిల్లు తీవ్ర దుమారం రేపింది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులంతా ఆందోళన చేపట్టారు. మొత్తానికి నిరసనల మధ్యే బిల్లు ఆమోదం పొందింది.
ఇదిలా ఉంటే శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అయితే సమావేశాల ముగింపులో సంప్రదాయం ప్రకారం ప్రధాని ‘టీ’ పార్టీ ఏర్పాటు చేస్తుంటారు. దీంతో సభ్యులందరికీ ప్రధాని మోడీ టీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంగాగాంధీ, సుప్రియా సూలే, తదితర అధికార, ప్రతిపక్ష సభ్యులంతా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సమావేశం సందర్భంగా ఆయా అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గురువారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రియాంకాగాంధీ కలిశారు. వయనాడ్ రహదారులపై చర్చించారు.
ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ‘ఢిల్లీ కాలుష్యం’పై చర్చకు డిమాండ్ చేస్తామని విపక్ష పార్టీలు అన్నాయి. తీరా చూస్తే.. అలాంటి ఊసే లేకుండా సమావేశాలు ముగిసిపోవడం చర్చనీయాంశం అవుతోంది. శుక్రవరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేశారు. పలు బిల్లులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ముఖ్యంగా ‘జీ-రామ్-జీ’ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాల ఆందోళనలు మధ్యే బిల్లు ఆమోదం పొందింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారు.
