Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల పంజా.. వరద గుప్పిట చెన్నై నగరం

Tamil Nadu Rains

Tamil Nadu Rains

Tamil Nadu Witnesses Heavy Rain: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవితం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా చెన్నై మహానగరం వరద గుప్పిట చిక్కుకుంది. చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని చాలా ప్రాంతాలు వరద నీరు చేరింది. సిటీలోని నుంగంబాక్కంలో నిన్న ఒకే రోజు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో పాటు సబర్బన్ రెడ్ హిల్స్ 13 సెంటీమీటర్లు, పెరంబూర్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మూడు దశాబ్ధాల తరువాత ఈ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు వర్షాల వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు.

అక్టోబర్ 29 నుంచి ఈశాన్య రుతుపనాలు తమిళనాడులో ప్రారంభం అయ్యాయి. కావేరి డెల్టా ప్రాంతంలో పాటు కన్యాకుమారి తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని 8 జిల్లాకలు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కాంచీపురం, చెంగల్పట్టు, తంజావూర్ జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తిరువల్లూర్, నాగపట్టణం, మైలారుదురై జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Read Also: Kamal Movie Crazy Update: క్రేజీ అప్డేట్.. భారతీయుడు-2లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి

చెన్నైలో వర్షాల దృష్ట్యా సీఎం ఎంకే స్టాలిన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. నగరంలోని సబ్ వేలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించి భారీ వర్షాలపై సమీక్ష జరిపారు. వర్షాల ప్రభావంతో కావేరీ నది పొంగిపొర్లుతోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర హెచ్చరిస్తోంది. రెడ్ అలెర్ట్ ప్రకటించిన 8 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.

చెన్నైలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వర్షాల వల్ల ఓ వ్యక్తి విద్యుత్ షాక్ తో చనిపోతే.. మరో మహిళ ఇళ్లు కూలి మరణించింది. రామనాథపురం, శివగంగ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లద్దని ప్రభుత్వం సూచించింది. రానున్న మూడు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి-కారైకల్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయిని.. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్టు, వెల్లూర్ సహా ఉత్తరాది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Exit mobile version